తాత జయంతి రోజున నాన్న సీఎం కావడం ఖాయం | Sakshi
Sakshi News home page

తాత జయంతి రోజున నాన్న సీఎం కావడం ఖాయం

Published Tue, Apr 16 2019 10:07 AM

Udhayanidhi Stalin Campaign in Tamil Nadu - Sakshi

పళ్లిపట్టు: తాత (కరుణానిధి) జయంతి రోజున నాన్న (స్టాలిన్‌) కావడం ఖాయమని నటుడు ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో  రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సోమవారం సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అరక్కోణం డీఎంకే అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా తిరుత్తణి నియోజకవర్గంలోని ఆర్కేపేట, అమ్మయార్‌కుప్పం, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, తిరుత్తణి ప్రాంతాల్లో స్టాలిన్‌ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ రోడ్‌షో చేపట్టారు. డీఎంకే క్యాడర్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు. రోడ్‌షోలో ఉదయనిధి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పీఎంకేకు ఎన్నికల సమయం వచ్చేసరికి  విమర్శలన్నీ కనుమరుగయ్యాయని, అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తున్నట్లు మాటమార్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని అన్నాడీఎంకే కూటమిని బహిష్కరించాలన్నారు. నరేంద్రమోదీతో దేశం పాతికేళ్లు వెనుబడిందని ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు జీవనోపాధి కొరవడి ఇబ్బందులు మధ్య అగమ్యగోచరంగా బతుకీడుస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని అవినీతి సొమ్మును వెలికితీసి   ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు రూ.ఆరువేలు చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ద్వారా లబ్ధి పొందేందుకు పేద విద్యార్థులు సైతం వైద్య విధ్య అభ్యసించేందుకు వీలుగా నీట్‌ రద్దుకు డీఎంకే కూటమిని ఆదరించాలన్నారు. ప్రజల మద్దతుతో ఉప ఎన్నికల్లో 22 నియోజకవర్గాల్లో డీఎంకే అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా జూన్‌ 3న తాత జయంతి రోజునే నాన్న సీఎం పదవీ ప్రమాణం చేయడం ఖాయమన్నారు. మండల కన్వీనర్‌ జీ.రవీంద్ర సహా కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

డీఎంకే కూటమితోనే నీట్‌ రద్దు– ఉదయనిధి స్టాలిన్‌వేలూరు: రాష్ట్రంలో డీఎంకే అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో పాటూ కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే నీట్‌ పరీక్షల రద్దు, విద్యారుణాల మాఫీ అవుతాయని సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. వేలూరు జిల్లా అరక్కోణం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థి జగద్రక్షగన్‌కు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్‌ సోమవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే గెలుపు ఖాయమన్నారు. అన్నాడీఎంకే మెగా కూటమి కాదని మానం చెడిన కూటమి అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. గతంలో రాత్రికి రాత్రే కరెన్సీ నోట్లను రద్దుచేసి ప్రజలను బ్యాంకుల వద్ద పడిగాపులు కాచే విధంగా చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు అన్నింటికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేసిన సమయంలో ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రస్తుతం ఉచిత హామీలు చేస్తూ ప్రజల వద్దకు వస్తున్న వారికి ఈనెల 18న జరిగే పోలింగ్‌లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కాట్పాడి చిత్తూరు బస్టాండ్, వళ్లిమలై రోడ్డు, తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి డీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు పార్లమెంట్‌ అభ్యర్థి జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు నందకుమార్, గాంధీ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement