
మరికొకరి పరిస్థితి విషమం
విజయ్ ఆలస్యంగా రావడం వల్లేనని ఎఫ్‌ఐఆర్
ఘటనపై హైకోర్టుకు తమిళ నటుడు విజయ్
విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్‌గాంధీ
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది.
సోమవారం ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం.
ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు.
హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్
తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు.
కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది.
ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత
కరూర్‌లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.