కర్ణాటక ఎన్నికలపై 30 లక్షల ట్వీట్లు...!

Twitter Flood On Karnataka Election - Sakshi

కన్నడ ఎన్నికల తీరుతెన్నుల గురించి ట్విటర్‌ వేదికగా  మూడువారాల్లోనే 30 లక్షల మంది స్పందించారు. కర్ణాటక ఎన్నికల గురించి ఏదో ఒక రూపంలో ప్రస్తావించారు. ‘ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి బ్రేకింగ్‌ న్యూస్‌ మొదలుకుని తెరవెనక కార్యకలాపాలు, రాజకీయపార్టీలు, అభ్యర్థులు, పౌరులు అనేక వాడివేడి వార్తలు, అంశాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన మొత్తం చర్చలకు మా సామాజిక మాధ్యమం మంచి వేదికగా ఏర్పడింది’ అంటూ ట్విటర్‌ స్వయంగా పేర్కొంది. ట్విటర్‌లో కర్ణాటక ఎన్నికలపై ఈ స్థాయిలో చర్చించడం, ట్వీట్లు చేయడం వల్ల అత్యధికంగా చర్చనీయాంశమైన ఎన్నికల్లో ఇవీ ఒకటిగా నిలుస్తున్నాయి. 

కర్ణాటకలో జరిగిన ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ట్విటర్‌ చర్చల్లో పాల్గొన్నారు.’ మొత్తం ఎన్నికల ›ప్రచారంలో భాగంగా  ప్రజలతో సంభాషించేందుకు రాజకీయనాయకులు, పార్టీలు ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు’ అని ట్విటర్‌ స్పందించింది. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల మధ్య జరిగిన పోరు సామాజికమాధ్యమాల్లో ప్రతిబించింది. మొత్తం ట్వీట్లలో 51 శాతం వాటాతో బీజేపీ ప్రధమస్థానంలో, 42 శాతంతో కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలిచింది. ట్విటర్లలో జేడీఎస్‌ గురించి 7 శాతం ప్రస్తావనలున్నాయి. ప్రధాని నరేంద్రమోదీని ఉద్ధేశించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌ను అత్యధికస్థాయిలో 10,151 రీట్వీట్లు చేశారు. దీనికి 22,930 లైక్లు లభించాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా  ట్విటర్‌లో అత్యధికంగా ప్రస్తావన వచ్చిన వ్యక్తిగా మోదీ నిలిచారు. ఈ ఎన్నికల్లో అతి ఎక్కువగా ప్రస్తావించిన అభ్యర్థిగా సిద్ధరామయ్య నమోదయ్యారు. 

మోస్ట్‌ ట్రెండింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌గా  2018 కర్ణాటక ఎన్నికలు, కర్ణాటక తీర్పు, కర్ణాటక ఎన్నికలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు  వంటివి నిలిచాయి. ‘ ఎన్నికల్లో రాజకీయ చర్చలకు, అందులోని అన్ని కోణాలను ట్విటర్‌ ప్రతిబింబిస్తోంది.  ట్విటర్‌ ద్వారా అభ్యర్థులు, రాజకీయనాయకులు ముఖాముఖి స్పందించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ట్విటర్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో ప్రచారాన్ని వీక్షించగలిగారు’ అని ట్విటర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ అండ్‌  గవర్నమెంట్‌ అధిపతి మహిమా కౌల్‌ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top