
సాక్షి, హైదరాబద్ : తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్.. మరింత దూకుడు పెంచింది. ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తున్న కేసీఆర్.. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మరో బహిరంగ సభ ఏర్పాటు సిద్ధమయ్యారు. ఈ సభకు ‘ప్రజా ఆశీర్వాద సభ’గా నామకరణం చేసినట్లు హరీశ్‌రావు ప్రకటించారు.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. మంత్రుల వెంట పలువురు ప్రజాప్రతినిధులున్నారు. సభ విజయవంతం చేసేందుకు మండలాల వారిగా ఇంఛార్జీలను నియమించారు.
హుస్నాబాద్ ఇంఛార్జ్‌గా ఎంపీ వినోద్, సతీష్ బాబు, సుధాకర్ రెడ్డిలను, కోహెడకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగులు, సైదాపూర్‌కు మంత్రి ఈటలను, భీమదేవరపల్లికి పుట్ట మధు, ఎల్కతుర్తికి విద్యాసాగర్‌రావులను ఇంఛార్జీలుగా నియమించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయా మండలాల ఇంఛార్జ్‌లు కార్యకర్తతో భేటీకానున్నారు.