ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే!

TRS Violates Election Code, Says Bhatti Vikramarka - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు  

సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క విమర్శించారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చిందని భట్టి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా ప్రభుత్వం యథేచ్చగా, ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులను ప్రకటనల పేరుతో ఖర్చు చేస్తోందని మండిపడ్డారు.  ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనని భట్టి విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి వివరించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై వారు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు చెప్పారు.

కల్వకుంట్ల రామారావు కాదు.. కారుకూతల రామారావు!
కల్వకుంట్ల రామారావు పేరును కారుకూతల రామారావుగా మార్చుకుంటే.. బాగుంటుందని టీ ​కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ ఎద్దేవా చేశారు. 60 నెలలు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అధికారమిస్తే.. 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. దీంతో కేసీఆర్ పరిపాలన చేతకాదని నిరూపించుకున్నాని ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు హోటల్ కత్రియలో ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుందని గీతారెడ్డి వెల్లడించారు. దీనికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శశిథరూర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంశంపై సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top