సీనియర్ల అలక

TRS Senior Leaders Disappointed In Ticket Allocations - Sakshi

అభ్యర్థుల ప్రకటనపై మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల కినుక

జాబితాలో తమవారి పేర్లు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ కడియం శ్రీహరి

మల్కాజ్‌గిరి ఇవ్వకుంటే పార్టీ వీడతానన్న మైనంపల్లి హన్మంతరావు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ ఎస్‌)లో అసంతృప్తులు షురూ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాపై పలువురు సీనియర్లు అలకబూనారు. తాము ఆశించినవారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు. పలువురు సీనియర్‌ నేతలతోపాటు కొందరు మంత్రులు కూడా ఈ విషయంలో సన్నిహితుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ అధినేత అనుసరించిన వైఖరి చాలామంది మంత్రులకు మింగుడు పడటంలేదు. అలాగని పరిస్థితిని అధినేతకు వివరించేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలూ కూడా చేయడంలేదు.

కొన్ని నియోజకవర్గాల విషయంలో ముఖ్యమంత్రి కుమారుడి (కేటీఆర్‌) మాటే చెల్లుబాటు కానప్పుడు తామెంత అనే ధోరణి వారిలో కనిపిస్తోంది. మరోవైపు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డవారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో మంత్రి కేటీఆర్‌ గత రెండు రోజులుగా క్యాంప్‌ కార్యాలయం దాటి బయటకు రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కేటీఆర్‌కు సైతం రుచించలేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ టికెట్‌ విషయంలో కేటీఆర్‌ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని వారు చెబుతున్నారు. దీంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు రెండు రోజులుగా కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం కేటీఆర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

అల్లుడి టిక్కెట్‌ విషయంలో నాయిని అలక 
తన అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ముషీరాబాద్‌ టికెట్‌ రాకపోవడంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయిని.. ఈసారి తన అల్లుడికి అక్కడ టికెట్‌ ఇప్పించడానికి ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి కూడా నాయిని వారసుడిగా నియోజకవర్గంలో చెలామణి అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయిని.. తన అల్లుడే ముషీరాబాద్‌ అభ్యర్థి అని తన అనుచరులకు కూడా చెప్పేశారు. తీరా అభ్యర్థుల ప్రకటనలో ముషీరాబాద్‌లో మరొకరి (ముఠా గోపాల్‌) పేరు ఉండటం చూసి ఆయన ఆగ్రహం చెందారు.

తన అల్లుడిని కాదని వేరొకరికి టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్‌లో జరిగిన సీఎం మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సంగతి తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థిగా తన అల్లుడి పేరు ప్రకటించాలని నాయిని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఎలాంటి కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

సాగర్‌ టికెట్‌పై కంగుతిన్న జగదీష్‌రెడ్డి 
మరో మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తితో ఉన్నారు. తన స్నేహితుడు, నల్లగొండ జిల్లాలో తనకు గట్టి మద్దతుదారుడైన న్యాయవాది ఎం.సి.కోటిరెడ్డికి నాగార్జునసాగర్‌ టికెట్‌ ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా టికెట్‌ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ వద్ద కూడా దీనిపై హామీ తీసుకున్నట్లు సమాచారం. ఇక కోటిరెడ్డికి టికెట్‌ ఖాయమని జగదీష్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. దీంతో కోటిరెడ్డి సైతం గత ఏడాదిగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గం కలియతిరిగారు. ఇక్కడి నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య స్థానికేతరుడు కావడం, మంత్రి ఆశీస్సులు ఉండటంతో తనకే టిక్కెట్‌ వస్తుందన్న ఉద్దేశంతో డబ్బులు కూడా భారీగా ఖర్చు చేశారు. తీరా అభ్యర్థుల ప్రకటనలో నర్సింహయ్య పేరు రావడం చూసి జగదీష్‌రెడ్డి కంగుతిన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో నోముల వెంట తిరిగిన పలువురు నేతలు.. ఈసారి ఆయనకు టికెట్‌ రాకపోవచ్చనే ఉద్దేశంతో కోటిరెడ్డి వర్గంలో చేరిపోయారు. వారంతా ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తర్జనభర్జనలు పడుతున్నారు. టికెట్‌ విషయంలో తనకే స్పష్టత లేదని, ఇంతకుమించి తన దగ్గర సమాధానం లేదని జగదీష్‌రెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. 

నొచ్చుకున్న కడియం 
అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేయాలని భావించారు. తనకు టికెట్‌ ఖాయమని విశ్వసించారు. అందుకు అనుగుణంగానే నియోజకవర్గంలోని ఆయన అనుచరగణం వచ్చే ఎన్నికల కోసం ఎప్పటి నుంచో సిద్ధమవుతోంది. గ్రామాలవారీగా అభివృద్ది కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే, అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడంతో కడియం తన సన్నిహితుల దగ్గర నొచ్చుకున్నట్లు తెలిసింది. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు నియోజకవర్గాలకు ఇద్దరు అభ్యర్థులను సూచించినా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. మరో ఇద్దరు సీనియర్‌ మంత్రులు సైతం టికెట్‌ ఇప్పిస్తామని, నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని చెప్పినా.. చివరి క్షణంలో వారికి సీట్లు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

పార్టీ మారి ఇరుకునపడ్డ గుత్తా, దానం 
రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న తాపత్రయంతో టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు లేదా మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ఈ రెండు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తనకు ఏదో ఒక చోట టికెట్‌ వస్తుందని గట్టిగా విశ్వసించారు. ఎంపీగా రాజీనామా చేస్తే ఎమ్మెల్సీగా రంగప్రవేశం చేసి మంత్రి కావాలన్న ఉద్దేశంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే, అప్పటి సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు తనకు అనుకూలంగా ఉండే రెండు నియోజకవర్గాలు కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని కోరడంతో గుత్తా తీవ్ర మనస్తాపం చెందారు. ఆ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం, అందులోనూ ఉత్తమ్‌కుమార్‌కు బలమైన నియోజకవర్గం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్‌ ఉండదని భావించి, తనకు టికెట్‌ వద్దని చెప్పారు.

దీంతో ఉత్తమ్‌ సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ టికెట్‌ ఇస్తామని పార్టీ ఆఫర్‌ చేసిందని అంటున్నారు. అయితే, ఈ విషయంలో గుత్తా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందువల్లే ఇంకా పార్టీ నిర్ణయం వెలువడలేదని చెబుతున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ సైతం మనస్తాపంతో ఉన్నారు. ఆయన ఖైరతాబాద్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారంఫార్మ్‌హౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. శనివారం కేటీఆర్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇంకా టిక్కెట్‌ ఖరారు కాకపోవడంపై నాగేందర్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

టికెట్‌ రాదనుకున్న సుభాష్‌రెడ్డి పేరు జాబితాలో... 
ఉప్పల్‌ నుంచి టికెట్‌ రాదనుకున్న భేతి సుభాష్‌రెడ్డి తన పేరు జాబితాలో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. కేటీఆర్‌ ఆశీస్సులు ఉన్న హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు టికెట్‌ వస్తుందని ఆయన భావించారు. దీంతో సుభాష్‌ అనుచరవర్గం కూడా రామ్మోహన్‌తో చేరిపోయింది. అయితే, అనూహ్యంగా సుభాష్‌రెడ్డి పేరు జాబితాలో కనిపించడంతో రామ్మోహన్‌ ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌ కు మద్దతుగా కొంతమంది కార్పొరేటర్లు శనివారం ప్రగతి భవన్‌ వద్ద కేటీఆర్‌ను కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరోవైపు మల్కాజ్‌గిరి టికెట్‌ తనకు ఇవ్వకుంటే పార్టీ వీడతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పరోక్షంగా హెచ్చరించారు. మాల్కాజ్‌గిరికి చెందిన పలువురు కార్పొరేట్లు ఆయనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. జాబితాలో తన పేరు చేర్చకుండా అవమానించారని మాజీ మంత్రి కొండా సురేఖ కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తమ్మీద ఈ టికెట్ల వ్యవహారం టీఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top