మీరు మైనారిటీలకు వ్యతిరేకం | TRS MPs fires on central govt | Sakshi
Sakshi News home page

మీరు మైనారిటీలకు వ్యతిరేకం

Mar 14 2018 2:40 AM | Updated on Mar 29 2019 9:04 PM

TRS MPs fires on central govt - Sakshi

ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకమని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ పార్టీకి పట్టరని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిప్పులు చెరిగారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, అలా పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లపై లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ వాయిదా పడగానే గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాం నాయక్, నగేష్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సి.హెచ్‌.మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘7 రోజులుగా ధర్నా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆమోదం తెలిపిన రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూలులో చేర్చాలన్నదే మా ప్రధాన డిమాండ్‌. ఒక దేశంలో ఒకే నీతి ఉండాలని కోరుతున్నాం. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలు వివిధ వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కు కల్పించాలని అడుగుతున్నాం. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం అమలు చేస్తున్నారు. రాజస్తాన్‌లో, హర్యానాలో అడుగుతున్నారు. అలాంటప్పుడు రిజర్వేషన్లపై మీ పెత్తనం ఎందుకు? మేం కేంద్రంలో రిజర్వేషన్లు అడగటం లేదు. మా రాష్ట్రంలో మేం ఇచ్చుకుంటాం అంటున్నాం. దేశంలో ఒకే పన్ను ఉండాలని జీఎస్టీ ఆమోదించుకున్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలని మద్దతు కూడగడుతున్నారు. అన్నీ ఒకటి ఉన్నప్పుడు రిజర్వేషన్లపై విభిన్న రీతులు ఎందుకు?’అని ప్రశ్నించారు.  

కేంద్రం దగా చేస్తోంది – సీతారాం 
ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, తెలంగాణలోనూ ఆ విధానాన్నే అమలు చేయాలని ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగంలో నిర్దిష్టంగా ఉంటే ఇవ్వకండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయొద్దా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఎక్కడుందో చెప్పండి. సుప్రీంకోర్టు.. తన తీర్పులోనే స్పష్టంగా ప్రత్యామ్నాయం చూపింది. కానీ కేంద్రం ఇది చేస్తం, అది చేస్తం అని దగా చేస్తోంది’అని విమర్శించారు.  

న్యాయమైన డిమాండ్‌ – డి. శ్రీనివాస్‌ 
రిజర్వేషన్ల పెంపు న్యాయమైన డిమాండ్‌ అని రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ అన్నారు. 1992లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు వీలుగా సవరణ చేశారని, ఇప్పుడూ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకునే వీలు కల్పించాలన్నారు. ‘మీరు మైనారిటీలకు వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పట్టరా? రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను కేంద్రం తొక్కిపెట్టడం సరికాదు. దయచేసి ప్రధాని జోక్యం చేసుకుని రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి’అన్నారు. ఎంపీ బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పెంపునకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్నాం. కేంద్రం పెడచెవిన పెట్టడాన్ని తెలంగాణ గమనిస్తోంది’ అని
అన్నారు.

బీజేపీకి మనుగడ ఉండదు– పసునూరి 
విభజన జరిగిన తర్వాత మారిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగకపోతే ఎస్సీలు నష్టపోతారని ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. ‘కేంద్రం అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు కనీసం పట్టించుకోలేదు. వర్గీకరణపై తెలంగాణ తీర్మానం చేసి పంపి నాలుగేళ్లయినా నిర్ణయం తీసుకోలేదు. వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్నా పెడచెవిన పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలను ప్రభుత్వం పక్కనబెడుతోంది. వీటిని పరిష్కరించకపోతే బీజేపీకి మనుగడ ఉండదు’అని దయాకర్‌ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement