టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం నేడు!

TRS LP meeting today! - Sakshi

ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహంపై చర్చ

రాష్ట్ర కార్యవర్గంతో తొలిసారి భేటీకానున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన మూడున్నరేళ్లుగా చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించు కోవాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రేపటి(శుక్రవారం) నుంచి మొదలు కానున్న వర్షాకాల శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొ నేందుకు వ్యూహ రచన చేస్తోంది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువా రం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్షం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహం పైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్న ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా ప్రతిపక్షాలు ఇటీవల కాలంలో వివిధ అంశాలపై చేసిన ఆందోళనల నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేసినా, అసెంబ్లీ వేదికగా మరింత వివరంగా చెప్పేందుకు ఇది అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. ఇప్పటికే ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించారు. విప్‌ల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సారి ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే అంశంపై చర్చించి, సీఎం కేసీఆర్‌ వారికి ఎల్పీ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజుల పాటు సభ జరపాలని, కనీసం 4 వారాలు సమావేశాలు జరపాలన్న ఆలోచన ఉన్నందున, ఆ మేరకు అధికార పార్టీగా వ్యవహరించాల్సిన తీరుపై, సభ్యుల ప్రాతినిధ్యంపై ఈ భేటీలో చర్చిస్తారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం...
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవలే ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తొలిసారి వారితో భేటీ కానున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు.. నియోజక వర్గాలు, జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతను కూడా ఈ సమావేశంలో అప్పజెప్పే అవకాశం ఉంది. వీరి బాధ్యతల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరిస్తారు. కార్యవర్గ సమావేశం తర్వాత ఎల్పీ సమావేశం జరగనుంది. అలాగే గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలో బీఏసీ భేటీ కానుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top