ఎమ్మెల్సీ పట్టం ఎవరికో..?

TRS Leaders Trying To Get MLC Ticket In North Telangana - Sakshi

శాసనమండలి ఎన్నికలపై ఊపందుకున్న చర్చ

పట్టభద్రుల స్థానంపై టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల కన్ను

సామాజిక కోణాల్లో ఎవరికీ వారుగా ప్రయత్నాలు

ఇప్పటినుంచే పావులు కదుపుతున్న గులాబీ దళనేత

మంత్రివర్గ విస్తరణ, పంచాయతీల తర్వాత అభ్యర్థులు?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు

అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. ఇప్పుడు పెద్దల సభపై దృష్టి పెట్టింది. పార్లమెంట్‌ కంటే ముందుగానే పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే శాసనమండలి అభ్యర్థులను ప్రకటించే విధంగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేసేదీ, లేనిదీ ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎంపీ కవితలను కలిసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటంతో ‘మండలి’ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరుగబోతున్న ఈ ఎన్నికల్లో పూర్వపు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈసారి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ ఉద్యమ ఊపులో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ మద్దతుతో శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ టికెట్‌ ఆశించారని ప్రచారం జరిగినా, అది ఆచరణకు రాలేదు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టత లేదు.

కాగా స్వామిగౌడ్, టీఎన్‌జీవోలు, అధిష్టానం మద్దతుతో గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌ తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చెప్పుకుంటూ వార్తల్లోకి వచ్చారు. అంతేగాక సీనియర్‌ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ కూడా ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఆయన మొట్టమొదటి శాసనమండలి 2007 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తన ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్‌ పిలుపు మేరకు ఏడాదిలోపు త్యాగం చేయగా, ఆ తర్వాత ఆయన ఏ పదవీ చేపట్టలేదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ రాని కారణంగా తీవ్ర అసంతృప్తికి గురికాగా, ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని ఆయనకు పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్‌రావు నచ్చజెప్పినట్లు వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థల రాష్ట్ర సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, టీఎన్జీవోల రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి షామీద్, పేర్యాల దేవేందర్‌రావు తదితరులు కూడా ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు. అయితే వీరిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు అవుతారన్న విషయమే ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సామాజిక కోణాలు ప్రామాణికమే....
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంతో ఊపు మీద ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ యంత్రాంగం చురుగ్గా ఉంది. ఈ కారణంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా యంత్రాంగమంతా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆశావహులు అదే స్థాయిలో మండలి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలో అధికార పార్టీ నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నా.. అధినేత కేసీఆర్‌ మదిలో ఎవరున్నారనేది చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వని కారణంగా ఒకవేళ ప్రస్తుత ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ అభ్యర్థిత్వాన్ని మళ్లీ ప్రకటిస్తారా? ప్రకటిస్తే పరిస్థితి అంత సానుకూలంగా ఉంటుందా? అన్న చర్చ అప్పుడే మొదలైంది.

స్వామిగౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కరీంనగర్‌ మేయర సర్దార్‌ రవీందర్‌సింగ్, హమీద్, యాదగిరి శేఖర్‌రావు తదితరుల ప్రయత్నాలు జోరందుకున్నాయి. కాగా ఈ నియోజకవర్గం నుంచి గడిచిన మూడు పర్యాయాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే విజయం సాధించారు. 2007లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పద్మశాలి కులానికి చెందిన జర్నలిస్టు ఆర్‌.సత్యనారాయణ టీఆర్‌ఎస్‌తో పాటు టీఎన్జీవోల యూనియన్, వామపక్ష ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో విజయం సాధించారు. ఆయన రాజీనామా నేపథ్యలలో 2008లో జరిగిన ఎన్నికల్లో ఎల్లావు కులానికి చెందిన న్యాయవాది లక్ష్మణ్‌రావు టీఆర్‌ఎస్‌ తరుపున గెలుపొందారు. అనంతరం 2013లో గౌడ కులానికి చెందిన స్వామిగౌడ్‌ టీఆర్‌ఎస్‌ తరుపున విజయం సాధించారు. ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగబోవు ఎన్నికల్లో కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎంపిక చేయబోవు అభ్యర్థి యొక్క సామాజికవర్గం కూడా ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉండగా... కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశం అయ్యింది.  ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నిర్ణయాన్ని బట్టి అనూహ్యమైన బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీజేపీ, కాంగ్రెస్, కూటమి పార్టీలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సంచలన నిర్ణయాలకు మారు పేరైన కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top