పీఠంపై గురి | TRS Focus On Adilabad ZPTC Set | Sakshi
Sakshi News home page

పీఠంపై గురి

Jun 6 2019 7:49 AM | Updated on Jun 6 2019 7:49 AM

TRS Focus On Adilabad ZPTC Set - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం మొదలైంది. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ దక్కడంతో ఆశావహులు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధిష్టానందే తుది నిర్ణయం అయినా నేతల ప్రాప్తి కోసం పాట్లు పడుతున్నారు. ఆశావహులను బుజ్జగించి అధిష్టానం ఎవరి పేరును నిర్ణయిస్తుందో జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక రోజే తేలనుంది. అధిష్టానం పంపించే సీల్డ్‌ కవర్‌లో ఎవరి పేరు ఉండబోతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.

ఆశావహుల జోరు 
పదిహేడు మంది జెడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ 9 మంది సభ్యులను గెలిచిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు ఎస్టీ అభ్యర్థులు అనిల్‌ జాదవ్, రాథోడ్‌ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరైనా చైర్మన్‌ పదవిని అధిరోహించనున్నారు. అనిల్‌ జాదవ్‌ చైర్మన్‌ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయనకు ఉమ్మడి జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అనిల్‌ జాదవ్‌ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఐకే రెడ్డితో సఖ్యత ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అనిల్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

అప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రి ఐకే రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, రాష్ట్ర డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డిల సమక్షంలో కేటీఆర్‌ అనిల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినప్పుడే జెడ్పీ చైర్మన్‌ పదవి విషయంలో భరోసా ఇచ్చారని అనిల్‌ తన సన్నిహితులతో తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ ఓటమి నేపథ్యంలో అధిష్టానం అనిల్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. మరో పక్క బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు అనిల్‌కు చైర్మన్‌ పదవిని కట్టబెట్టే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న సైతం అనిల్‌ విషయంలో కొంత దూరంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం రాజకీయ అనుభవం ఉన్న అనిల్‌ను చైర్మన్‌గా పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది ఎన్నిక వరకు తెలియని పరిస్థితి నెలకొంది.

రాథోడ్‌కు మద్దతు..
నార్నూర్‌ జెడ్పీటీసీగా గెలిచిన రాథోడ్‌ జనార్దన్‌కు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే నార్నూర్‌ మండలం ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోకి వస్తుంది. ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కోవలక్ష్మి అధిరోహించనున్న నేపథ్యంలో అదే నియోజకవర్గంలోని నార్నూర్‌ జెడ్పీటీసీ రాథోడ్‌ జనార్దన్‌కు ఆదిలాబాద్‌ జెడ్పీ పీఠాన్ని కేటాయిస్తారా? అనేది ఆసక్తికరమే. అయితే ఆసిఫాబాద్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఆదివాసీ కావడం, రాథోడ్‌ జనార్దన్‌ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అధిష్టానం ఒక వేళ ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటే ఈ అంశం ఒక్కటే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీకి చైర్మన్‌ పదవి ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు గెలిచిన 9 మందిలో భీంపూర్‌ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ ఒక్కరే ఉండటం గమనార్హం. సీల్డ్‌ కవర్‌లో ఎవరి పేరు ఉంటుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

కొనసాగుతున్న శిబిరం..
టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జెడ్పీటీసీల శిబిర రాజకీయ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 17 మంది సభ్యులు శిబిరానికి వెళ్లిపోగా, తాజాగా ఫలితాల అనంతరం ఓడిపోయిన జెడ్పీటీసీ అభ్యర్థులు తిరిగి వచ్చారు. ఆ తొమ్మిది మంది మాత్రం ఎక్కడ ఉన్నారనేది రహస్యంగా ఉంచారు. ఆదిలాబాద్‌ జెడ్పీ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా ఉండడంతో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ 9 మంది మెజార్టీ సభ్యులను గెలిచినప్పటికీ, బీజేపీ ఐదు, కాంగ్రెస్‌ మూడు గెలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. సంఖ్యాబలం 9లో ఒకటి తేడా వచ్చినా పీఠం తారుమారయ్యే పరిస్థితి ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement