చేవెళ్లలో త్రిముఖం

TRS And Congress tough Competition in Chevella MLA - Sakshi

బరిలో హేమాహేమీలు  

కాంగ్రెస్‌లో కొండా, టీఆర్‌ఎస్‌లో ‘పట్నం’  

బీజేపీ తరఫున జనార్దన్‌రెడ్డి  

సాక్షి, సిటీబ్యూరో: చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి హేమాహేమీలు బరిలోకి దిగనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల ఆశావహులు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లోక్‌సభ పరిధిలో జీహెచ్‌ఎంసీలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనే సుమారు 65శాతం ఓటర్లుండటం గమనార్హం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా... తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సైతం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తోంది. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన విషయం విదితమే. ఈసారీ ఆయనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి తొలుత పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచినా.. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని తాండూరు, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించడం, మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా మెజారిటీ పెద్దగా రాకపోవడంతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కొండా వర్సెస్‌ పట్నం...  
టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని బరిలోకి దించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఢీకొట్టాలంటే మహేందర్‌రెడ్డినే సరైన అభ్యర్థి అని పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. తాండూరు శాసనసభ నుంచి ఓటమి పాలైన మహేందర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో కొండాను ఢీకొట్టి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతోనూ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అంతర్గతంగా మహేందర్‌రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించినట్లు తెలిసింది.  

బీజేపీ ఆశలు...  
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛరిష్మా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే బూత్‌ల వారీగా కమిటీలు వేసి ముఖ్య నాయకుల సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ నియోకజవర్గం నుంచి బి.జనార్దన్‌రెడ్డిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. మార్చి 2లోగా ముగ్గురి పేర్లను సూచించాల్సిందిగా పార్టీ ఆదేశించినప్పటికీ... ఈ నియోజకవర్గం నుంచి జనార్దన్‌రెడ్డి ఒక్కడి పేరునే సిఫారసు చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top