మేమిస్తే.. మీరు లాక్కుంటారా.? | TPCC Chief Uttam Kumar Reddy Fires on TRS Govt | Sakshi
Sakshi News home page

మేమిస్తే.. మీరు లాక్కుంటారా.?

May 2 2018 2:32 AM | Updated on Mar 18 2019 8:51 PM

TPCC Chief Uttam Kumar Reddy Fires on TRS Govt - Sakshi

మంగళవారం కామారెడ్డిలో జరిగిన గిరిజన సదస్సులో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, కామారెడ్డి: తరతరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై కాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కు పత్రాలను ఇస్తే ప్రస్తుత టీఆర్‌ఎస్‌ సర్కారు వారి భూములను లాక్కుంటోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గిరిజన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి రాగానే చేయతలపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ‘గిరిజన డిక్లరేషన్‌’ప్రకటించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి సీఎం కేసీఆర్‌ మోసం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. హామీలు అమలు చేయకపోగా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపడం, గొత్తికోయ మహిళలను బట్టలిప్పించి అవమానించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది’అని మండిపడ్డారు. ‘కేసీఆర్‌.. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే ఖబడ్దార్‌.. నీ అంతు చూస్తాం’అని హెచ్చరించారు. 

టీఆర్‌ఎస్‌ పాలనకు చివరి రోజులు 
సరైన ధరలు లేక పత్తి, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలనకు చివరి రోజులు మొదలయ్యాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, నిశ్శబ్ద విప్లవం రానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు వేరే రాష్ట్రాల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 80 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

అందరూ మోసపోయారు: జానారెడ్డి 
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అయితే కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు నమ్మి టీఆర్‌ఎస్‌కు ఓటేసిన పాపానికి ప్రజలు మోసపోయారని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. రైతులను మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల పంపిణీ మొదలుపెట్టిందన్నారు. అప్పులు చేయడంలో సీఎం రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. హామీలు నిలబెట్టుకోలేని టీఆర్‌ఎస్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్, మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. 

గిరిజన డిక్లరేషన్‌ 
1. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. 
2. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగాలు అందిస్తాం. 
3. రాష్ట్ర ఏర్పాటు బిల్లులో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించి చట్టం ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రావడం లేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాం. 
4. బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని స్థాపించి ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 
5. గిరిజనులు నివసించే అన్ని మైదాన ప్రాంతాల్లోనూ ఐటీడీఏలను ఏర్పాటు చేస్తాం. ఐటీడీఏ ద్వారా గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. 
6. 22 లక్షల మందికి ఇళ్లు లేవని తేల్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2 లక్షలు కూడా నిర్మించలేకపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇళ్లు లేనివారందరికీ నిర్మించి ఇస్తాం. 
7. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధులను వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. 
8. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఇప్పటికే పట్టాలిచ్చాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనుల నుంచి గుంజుకుంటోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి గిరిజనులకే అప్పగిస్తాం. గిరిజనులకు అండగా ఉంటాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement