నేడు కాంగ్రెస్‌ ‘బస్సుయాత్ర’

Today Congress Bus Tour Starts - Sakshi

హాజరు కానున్న ఉత్తమ్, జానా, భట్టి, తదితరులు

ఇల్లెందు: టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ విజయవంతం కోసం నేతలు సర్వం సిద్ధంచేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లెందులో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం విదితమే. వారం రోజులుగా బస్‌యాత్ర విజయవంతం కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ బస్‌ యాత్ర ఇన్‌చార్జ్‌ జగల్‌లాల్, నియోజకవర్గ సమన్వయకర్త తాజుద్దీన్‌ బాబా, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌లు నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలను, నేతలను సమన్వయపర్చారు.  మూడు దఫాలు వాయిదా పడిన  కాంగ్రెస్‌ సభ ఎట్టకేలకు ఖరారు కావటంతో సభ విజయవంతం మీదే నేతలు దృష్టిసారించారు.

టీపీసీసీ నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సు యాత్ర సభలో అగ్రనేతలంతా హాజరు అవుతుందటంతో ఆయా మండలాలు, పట్టణ  అధ్యక్షులు, రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. టీపీసీసీ నిర్వహించే సభ విజయవంతం చేసి అగ్రనేతల దృష్టిని ఆకర్షించాలని టికెట్‌ ఆశించే నేతలు చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బి.రాంచందర్‌నాయక్, బానోతు హరిప్రియతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నేతలు తమదైన శైలిలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగు పెడుతున్న బస్‌ యాత్ర ప్రప్రథమంగా ఇల్లెందు నుంచే ప్రారంభం అవుతుండటంతో నేతల్లో సందడి మొదలైంది.

ఇల్లెందులో సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ తనదైన శైలిలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు యత్నిస్తోంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా  జిల్లాలోని ఇల్లెందులో తొలి బస్సు యాత్ర సభ జరుగనుంది. ఈ సభకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, నాయకులు రేవంత్‌రెడ్డి, రేణుకచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొననున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top