అధికారం కోసమే  కాంగ్రెస్‌ మాయమాటలు

Thummala Nageswara Rao Slams On Congress Leaders Khammam - Sakshi

ఖమ్మం అర్బన్‌: అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  చేయలేని పనులు చేస్తామంటూ, అనేక పార్టీలతో కూడబల్కోని మాయ మాటలు చెప్తున్నారని టీఆర్‌ఎస్‌ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని నగరంలోని 1వ డివిజన్‌ కైకొండాయిగూడెంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు  రాబోయే ఐదు ఏళ్ల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రూపకల్పన చేశారన్నారు.

ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సాగు, తాగు నీటి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి దిశగా ఎనలేని కృషి చేశామన్నారు. విజయ దశమి రోజు ప్రచారం ప్రారంభిస్తే విజయం చేకూరుతుందని నియోజకవర్గానికి తూర్పున ఉన్న కైకొండాయిగూడెం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. గత ఉప ఎన్నికల్లో కైకొండాయిగూడెం నుంచే ప్రచారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి కోసం గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి కరువు ప్రాంతంగా ఉన్న తిరుమలాయపాలెం మండలంలో నీరు అందించి పచ్చని పల్లె వాతావరణ తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులకు పంటపెట్టుబడిని గత ఏడాది అందించినట్లు  ఎన్నికల తర్వాత నుంచి ఏడాదికి ఎకరానికి రూ 10 వేలు అందించబోతున్నట్లు తెలిపారు.

దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతు బీమాను అమలు చేసినట్లు పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1వ డివిజన్‌ కైకొండాయిగూడెంలో రూ.7 కోట్లతో నిధులతో ప్రతి డొంకను రహదారిగా మార్చినట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల్లో 46 వేల మెజార్టీతో తుమ్మలను గెలిపించారని  పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తుమ్మలను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసినట్లు తెలిపారు.

ఇంకా ఈ ప్రచార సభలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఐడీసీ చైర్మన్‌ బేగ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్, రైతు సమన్యయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ ధరావత్‌ రామ్మూర్తినాయక్, జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, కమర్తపు మురళీ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బెల్లం వేణు, స్థానిక నాయకుల గుర్రం వెంకటరామయ్య, తేజావత్‌ పంతులు సంపెట ఉపేందర్, గద్దల నాగేశ్వరరావు, తాళ్లూరి శ్రీను, తేజావత్‌ సంఘ, శ్రీను, ఆజ్మీరా ఆశోక్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా  నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలు, బతుకమ్మ ఊరేగింపులతో తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top