మండల పరిషత్‌లపై గులాబీ జెండా

Telangana MPP Elections TRS Full Josh In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 13 మంది ఎంపీటీసీలు మండల పరిషత్‌ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్, మంచాల ఎంపీపీలు దక్కగా.. బీజేపీ కందుకూరు, యాచారం స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ (ఏఐఎఫ్‌బీ) ఎగురేసుకుపోయింది. కోరం లేకపోవడంతో మరో రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. కాగా, ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పలు చోట్ల నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు.. కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ వాళ్లు టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారు. ఇంకొన్ని చోట్ల గురువారం రాత్రి వరకు శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు.. తీరా ఎన్నికకు గైర్హాజరయ్యారు. మరికొందరు ఒక పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి.. ఎంపీపీగా ఎన్నికకాగానే గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు.
 
కారు స్పీడు 11 నుంచి 13కు.. 
టీఆర్‌ఎస్‌ పార్టీ 20 ఎంపీపీ స్థానాల్లో పాగా వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్‌ఎస్‌ స్థానాలు తగ్గాయి. ఒకటి రెండు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు బలం ఉన్నప్పటికీ స్థానాలను దక్కించుకోవడంలో విఫలమైంది. ఆ అవకాశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. అధికారికంగా టీఆర్‌ఎస్‌ 11 ఎంపీపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే, కొత్తూరు ఎంపీపీగా గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి.. అప్పటికప్పుడే కారెక్కారు. కొందుర్గు ఎంపీపీగా> విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ పోతురాజు జంగయ్యకు టీఆర్‌ఎస్‌ బీ–ఫారం అందజేసింది. ఇలా వీరిద్దరు అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో అధికార పార్టీ ఎంపీపీల సంఖ్య 13కు చేరుకుంది. ఇక కోరం లేకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల ఎన్నికలను ప్రిసైడింగ్‌ అధికారులు వాయిదా వేశారు. ఈ రెండు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిపై సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. నేనంటే.. నేను అని ఎంపీటీసీలు పోటీపడటంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దీంతో ఎంపీటీసీలు ఎన్నికకు దూరంగా ఉండటంతో కనీసం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కూడా జరగలేదు. ఎన్నికల సంఘం త్వరలో సూచించే తేదీన ఈ రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రిసైడింగ్‌ అధికారులు పేర్కొన్నారు.  

ఉపాధ్యక్షుల్లో టీఆర్‌ఎస్‌కు తగ్గిన బలం..

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుల ఎన్నికకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌ బలం తగ్గింది. ఆ పార్టీ ఎంపీటీసీలు 7 మండలాల్లో మాత్రమే వైస్‌ ప్రసిడెంట్లుగా ఎన్నికయారు. అనూహ్యంగా స్వతంత్రులు ఏడు స్థానాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్‌ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. ఏఐఎఫ్‌బీ పార్టీ తరఫున ఒకరు వైస్‌ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. కోరం లేకపోవడం, అభ్యర్థులపై ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల, నందిగామ, శంషాబాద్‌ మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆమనగల్లు, మాడ్గులలో తప్ప మిగిలిన 19 మండలాల్లోకోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top