ఎమ్మెల్సీ రేసులో ఎవరు? | Telangana MLC Elections TRS Candidate Suspense | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రేసులో ఎవరు?

May 11 2019 10:09 AM | Updated on May 11 2019 10:09 AM

Telangana MLC Elections TRS Candidate Suspense - Sakshi

పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ విషయమై సస్పెన్స్‌ కొనసాగుతుండగా ఆశావహులు ఎవరికి వారుగా తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 14వ తేదీన నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ప్రస్తుత ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకోనున్న నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయ్యాక తన నిర్ణయాన్ని సోమవారం వరకు ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి కానీ అభ్యర్థి ఎవరనే విషయమై చర్చలకు పుల్‌స్టాప్‌ పడదనే చెప్పాలి.
 
ఇతర రాష్ట్రాలకు కేసీఆర్‌
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల పర్యటనకు కుటుంబంతో సహా వెళ్లారు. దీంతో ఈనెల 7న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినా వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపికపై స్తబ్దత నెలకొంది. ఇతర రాష్ట్రాల పర్యటన ముగించుకుని కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకుంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. అయితే, 14వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. కేసీఆర్‌ హైదరాబాద్‌ రాగానే అభ్యర్థిత్వంపై స్పష్టం వస్తుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటిం చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు సం బంధించిన మంత్రి దయాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నేతలతో ఆదివారం భేటీ అవుతారని సమాచారం. ఆ తర్వాత సోమవారం అధికారికంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు.

అదష్టవంతులు ఎవరో
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇద్దరు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్‌ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ రేసులో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్న రవీందర్‌రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళీధర్‌రావు రాజీనామా చేసిన గత డిసెంబర్‌లో రవీందర్‌రావు పేరే ప్రధానంగా చెప్పుకున్నారు. అయితే హైదరాబాద్‌లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే ఖరారవుతుందన్న మరో ప్రచారం కూడా సాగుతోంది.

ఇదే విషయమై ఆయన అనుచరులు సోషల్‌ మీడియాలో ఇటీవల పోస్టింగ్‌లు పెట్టిన సందర్భంగా స్పం దించిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పేరు ఖరారు కాలేదని, అధికారికంగా సీఎం కేసీఆర్‌ తన నిర్ణయించనందున కార్యకర్తలు సంయమనం పాటించాలం టూ లేఖ విడుదల చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే విషయమై సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ శని వారం హైదరాబాద్‌కు చేరుకోనున్న నేపథ్యంలో మళ్లీ చర్చ మొదలైంది. నేడో, రేపో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో చర్చించనున్న అధినేత ఎమ్మెల్యే అభ్యర్థి పేరును సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement