మోదీ వ్యాఖ్యలు పెద్ద జోక్‌ 

Telangana congress leaders fire on pm modi - Sakshi

ఫెడరల్‌ ఫ్రంట్‌ తెలియదనడం  ప్రజలను మోసం చేయడమే

ప్రజాకూటమి ఓడిపోయింది... కానీ బీజేపీ మట్టికొట్టుకుపోయింది

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి తనకు తెలియదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం దేశ ప్రజలను మోసగించడమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. మోదీ అలా చెప్పడం 2019లోనే అతిపెద్ద జోక్‌ అని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి పాలయిందని చెప్తున్న మోదీ, అదే తెలంగాణలో బీజేపీ మట్టికొట్టుకుని పోయిం దన్న సోయి తెచ్చుకోవాలని హితవు పలి కారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గోషామహల్‌లో ఎంఐఎంతో కుమ్మక్కయి పోరాడితే రాజాసింగ్‌ ఒక్కడే బయటపడ్డాడని, ఉన్న స్థానాలను పోగొట్టుకోవడంతో పాటు 105 చోట్ల బీజేపీ డిపాజిట్లు కోల్పో యిందని ఎద్దేవా చేశారు. ఇది మర్చిపోయి ప్రజాకూటమి ఓటమిపాలయిందని సంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమని అన్నారు.

బీజేపీ అభ్యర్థులను మోదీ, అమిత్‌షాలు మోసగించారని, పులి తన పిల్లలను తానే తిన్న చందంగా వ్యవహరించారని విమర్శించారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీకి 22 సీట్లు ఉండేవని 2018లో కేవలం 3 సీట్లు మాత్రమే కోల్పోయామన్నారు. రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్చుకోలేకే మోదీ, కేసీఆర్‌లు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. రాఫెల్‌ కుంభకోణంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ పార్లమెంటు లో సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, ఈ కుంభకోణంలో వాస్తవాలను వెలికితీయాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మోదీ ఇటీవల ఇచ్చిన 90 నిమిషాల ఇంటర్వ్యూలో ప్రజలను మభ్యపెట్టడం మినహా మరేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం ఆమ్‌ఆద్మీది కాదని, అంబానీ, అదానీలదని ఎద్దేవా చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top