సవ్యంగానే సాగుతున్నాయ్‌

Telangana Assembly Election Preparations Going on Says Dy Election Commissioner - Sakshi

రాష్ట్రంలో ‘ఎన్నికల’ సన్నాహాలపై కేంద్ర బృందం సంతృప్తి 

కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో భేటీలు 

ఎన్నికలపై కేంద్ర ఎన్నికలసంఘానిదే తుది నిర్ణయం 

సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సన్నాహాలను పరిశీలించామని, అవన్నీ సవ్యంగానే సాగుతున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రం ఎన్నికలకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. రాష్ట్ర శాసనసభ రద్దు అయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై అధ్యయనం చేయడానికి ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే.

జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో మంగళవారం విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు, సూచనలను స్వీకరించిన ఈ కమిటీ.. బుధవారం తొలుత కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సుదీర్ఘంగా సమావేశమై చర్చించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోనూ భేటీ అయింది. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లేముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, తన బృందంలోని ఇతర అధికారులతో కలిసి ఉమేశ్‌ సిన్హా విలేకరులతో మాట్లాడారు. రెండురోజులపాటు వరుసగా నిర్వహించిన సమావేశాల్లో పరిశీలనకు వచ్చిన అంశాలు, సేకరించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ వెళ్లిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా బలగాలు, ఈవీఎంలు, వీవీ పాడ్‌ యంత్రాలు, నిధులు ఇతర సదుపాయాలపై సమీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షల ఆధారంగా సేకరించిన సమాచారంతో పాటు తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన ఏడు మండలాలకు సంబంధించిన అంశాన్ని కూడా నివేదికలో పొందుపరుస్తామని వెల్లడించారు. 

తప్పుగా తొలగించిన ప్రతి ఓటునూ చేర్చాలి... 
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఆందోళన వ్యక్తమైందని ఉమేశ్‌ సిన్హా తెలిపారు. బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ) క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి ఇంకా ఓటరుగా నమోదు కాని వ్యక్తులను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ‘‘తప్పుగా తొలగించిన పేర్లన్నింటినీ విధిగా ఓటరు జాబితాలో చేర్చాలి. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించాలి. తప్పుడు ఎంట్రీలిచ్చిన వారికి సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమంపై రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారోద్యమం నిర్వహించాలి. ప్రతి గ్రామంలో పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఓటరు జాబితాలను చదవి వినిపించే ఏర్పాట్లు చేయాలి. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం’’అని ఉమేశ్‌ తెలిపారు. 

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కోరినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణ తీరుపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించినట్టు వెల్లడించారు. ఓటరు జాబితాలపై రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు 24 గంటల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. జిల్లాల్లో హెల్ప్‌లైన్లు 24 గంటలు పని చేయాలని స్పష్టంచేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో సమీక్షించేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాల్సిందిగా ఓటర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించాలని కోరారు. 

సీనియర్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బూత్‌ స్థాయి అధికారులు ఓటర్ల జాబితా సవరణకు చర్యలు తీసుకుంటున్నారో లేదో పరిశీలించాలన్నారు. ఒకవేళ బూత్‌ స్థాయి అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో లేకుంటే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసినట్టు చెప్పారు. అలాగే రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితా సాఫ్ట్, హార్డ్‌ కాపీలు అందజేయాలని సూచించినట్టు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ సభ్యులైన డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సుదీప్‌ జైన్, సందీప్‌ సక్సేనా, ముఖ్య కార్యదర్శి సుమిత్‌ ముఖర్జీ, డీజీ ధీరేంద్ర ఓఝా, దిలీప్‌ శర్మ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top