ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్‌ఎస్ ఎంపీలు కె ఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారు కోరారు.
అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వ్యంలో ఎన్నికల నిర్వహించాలని ఈసీని కోరారు బీఆర్‌ఎస్ ఎంపీలు. జూబ్లీహిల్స్‌లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలా జరగని పక్షంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందనే విషయాన్ని సీఈసీకి తెలిపినట్లు మీడియాకు బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి స్పష్టంచేశారు.


