నా తమ్ముడికి ఎల్లప్పుడూ అండగా ఉంటా

Tej Pratap Yadav Says He Stand By Tejashwi After RJD Loss - Sakshi

పట్నా : తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన తేజస్వీ రాజీనామా చేయాలంటూ ముజఫర్‌పూర్‌ ఆర్జేడీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ యాదవ్‌ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తే తమ కొంప ముంచిందని.. ఇటువంటి నిర్ణయం తీసుకుని తేజస్వీ తప్పు చేశారని విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌..‘ తేజస్వీ నాయకత్వాన్ని ఇష్టపడని వారెవరైనా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. మహాఘట్‌బంధన్‌, ఆర్జేడీ నేతలైనా సరే మీ ఇష్టం వచ్చినట్లు నడచుకోండి. కానీ నేను ఎల్లప్పుడూ తేజస్వీకి అండగా ఉంటాను. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత నా ప్రియమైన సోదరుడికి లేఖ రాశాను. గెలుపోటములు సహజమని చెప్పాను. అయితే బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఏ సమస్యను పరిష్కరించదు. ఓటమిపై విచారిస్తూ కూర్చుంటే సరిపోదు. ఇంట్లోనే ఉన్న మన శత్రువులను లాగిపడేద్దాం. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేసింది. ఓటర్లెలా మోసపోయారన్న విషయాలపై నేను, తేజస్వీ అందరికీ వివరిస్తాం. కృష్ణుడిలా ఎల్లప్పుడూ నా తమ్ముడి పక్కనే నిల్చుంటా’అని వ్యాఖ్యానించారు.

కాగా గత కొంత కాలంగా తేజ్‌ ప్రతాప్‌, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్‌ ప్రతాప్‌ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్‌ ప్రతాప్‌ విభేదించారు. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న కొడుకు తేజస్వీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top