‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్‌ మళ్లీ..

TDP MP Murali Mohan Explanation On His Venkanna Chowdary Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు. వేంకటేశ్వరుడిని ‘వెంకన్న చౌదరి’గా పేర్కొన్న వీడియో వైరల్‌ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దీంతో టీడీపీ ఇరకాటంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్‌ శుక్రవారం మళ్లీ ఓ వీడియోను విడుదల చేశారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని అన్నారు.

టంగ్‌ స్లిప్‌ సహజమే!: ‘‘రాజమండ్రిలో ఒక మీటింగ్‌లో పొరపాటున ‘వెంకన్న చౌదరి’ అన్నాను. అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని ‘చౌదరిగారూ.. చౌదరిగారూ..’ అని మాట్లాడుకున్నాం. వెంకన్న చౌదరి అనడం టంగ్‌ స్లిప్పే తప్ప.. దేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కాను. ఎందుకంటే అసలు నాకు కులాల మీద నమ్మకమే ఉండదు. అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతాను? టంగ్‌ స్లిప్‌ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఉదయం పూజ చేసేటప్పుడు కూడా దేవుడికి మొక్కుకున్నా.. ‘టంగ్‌ స్లిప్‌ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు..’ అని దేవుడికి దండం పెట్టుకున్నా’’ అంటూ మురళీమోహన్‌ వివరణ ఇచ్చుకున్నారు.

అసలేం జరిగింది?: బుధవారం రాజమండ్రిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ఓటమికిగల కారణాలను విశ్లేషించారు. ఆ క్రమంలో మా ‘వెంకన్న చౌదరి’ వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ ఏకంగా దేవుడికి కులాన్ని అంటగట్టేశారు. మురళీమోహన్‌ వ్యాఖ్యలు పెనుదుమారం రేగడంతో టీడీపీ ఇరాకటంలో పడింది. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు మురళీమోహన్‌ మరో వీడియోను పోస్ట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top