టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

TDP Leaders Using Unparliamentary Language On YSRCP MLA Sridevi - Sakshi

సాక్షి, అమరావతి : తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటనపై శ్రీదేవి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. అణగారిన వర్గాల వారంటే టీడీపీ నేతలకు చిన్నచూపని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే పట్లే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top