తాండూరులో ఒక్కటైన కాంగ్రెస్‌ నేతలు

Tandur Congress Party Leaders Maintaining Good Relations - Sakshi

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి మరోసారి  రుజువైంది. నిన్న మొన్నటి వరకు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కాంగ్రెస్‌ తాండూరు నేతలు నేడు ఐక్యతారాగం  వినిపిస్తున్నారు. తాండూరులో పార్టీ పగ్గాలు తమ చేతుల్లో నుంచి జారిపోతున్నాయనే భావనే దీనికి కారణం. ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతూ.. అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తమకు.. కొత్త నేతల ఎంట్రీతో ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని భావించారు. దీంతో సీనియర్, జూనియర్‌  అనే తేడా లేకుండా ఒక్కతాటిపైకి వచ్చారు. తాండూరులో ఇన్నాళ్ల పాటు రెండు వర్గాలుగా కొనసాగిన మహరాజులు, లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారు. ఇది ప్రస్తుతం  చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో స్థానికంగా జరుగుతున్న పరిణామాలన్నింటికీ పైలెట్‌ రోహిత్‌రెడ్డియే కారణమంటూ ఏకంగా టీపీసీసీ నేతలను కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం.   

తాండూరు : ఏడాది క్రితం వరకు తాండూరులో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా విజయం సాధిస్తారనే విధంగా ఉండేది. ఏడాది క్రితం పట్టణంలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఏఐసీసీ ప్రతినిధులు.. తమ అభ్యర్థిగా రమేష్‌ మహరాజ్‌ పేరు ప్రకటించారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని సీనియర్‌ నాయకులు మహరాజుల కుటుంబంపై తిరుగుబావుటా ఎగురవేశారు. నాటి నుంచి మహరాజుల(రమేష్‌ మహరాజ్‌)కు వ్యతిరేకంగా పని చేశారు. లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతాసంపత్‌ తాము సైతం ఎన్నికల బరిలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. రమేష్‌ వర్గంతో దూరంగా ఉంటూవచ్చిన వీరిరువురూ కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. రమేష్‌ మహరాజ్‌ ఏడాది కాలంగా పార్టీలో చురుగ్గా పని చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆయనకు పూర్తి సహకా రం అందించారు.

అయితే లక్ష్మారెడ్డి, సునీత తీరు రమేష్‌కు ఇబ్బందికరంగా మారడంతో కలత చెందారు. ఈ నేపథ్యంలో తన వంశస్తుల నుంచి, లక్ష్మారెడ్డివర్గం నుంచి సరైన మద్దతు లభించలేదు. అప్పటికే కొంత అనారోగ్యానికి గురైన రమేష్‌ మహరాజ్‌ వైద్య పరీక్షల కోసం ఆమెరాకా వెళ్లాల్సి వచ్చింది. అనుకోకుండా ప్రభుత్వం రద్దు కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఏళ్ల తరబడి తన వెంట నడిచిన నాయకులను.. కొత్తగా పార్టీలో చేరిన పైలెట్‌ రోహిత్‌రెడ్డికి జత కలిపారు. టికెట్‌ సైతం పైలెట్‌కు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాసి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవల ఇండియా తిరిగొచ్చిన రమేష్‌కు తాండూరు రాజకీయాలు విస్మయం కలిగించాయి. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కబెట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి నడుం కట్టారు.

సీనియర్లలో అంతర్మథనం..
తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేరును అధిష్టాన నేతలు జాబితాలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు సీనియర్లు అంతర్మథనానికి గురయ్యారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేతలు.. ఇక పార్టీ బాధ్యతలు తమ చేతుల్లో నుంచి జారిపోతున్నాయని భావించారు. రోహిత్‌ వస్తే తమ ప్రభావం ఉండదని నిర్ణయించుకున్నారు. సీనియర్లకే అవకాశం ఇవ్వాలని, దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న వారిని పక్కనబెట్టి కొత్తవారికి రెడ్‌ కార్పెట్‌ వేయొద్దని అభ్యర్థిస్తూ గాంధీభవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయి తే వాట్సప్‌ గ్రూపుల్లో బీసీలపై అనుచిత వ్యాఖ్య లు చేశారని రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బీసీ సంఘం నాయకులు రంగంలోకి దిగి రోహిత్‌ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముదిరాజ్‌లతో పాటు బీసీలను దూషించిన రోహిత్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రోహిత్‌కు టికెట్‌ రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌ తాండూరు నాయకులంతా ఒక్కటయ్యారు. ఆయనను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలని పీసీసీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఢిల్లీకి చేరడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.  

రోహిత్‌ను సస్పెండ్‌ చేయండి
టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, యంగ్‌లీడర్స్‌ అధ్యక్షుడు రోహిత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తాండూరుకు చెందిన ఆ పార్టీ నాయకులు గురువారం టీపీసీసీ నేతలకు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రమేష్‌మహరాజ్, సీనియర్‌ నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి చందుమహరాజ్‌ తనయుడు నరేష్‌ మహరాజ్, సంపత్‌కుమార్, తాండూరు పట్టణ అధ్యక్షుడు పట్లోళ్ల నర్సింలు, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసచారి తదితరులు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పెద్దలను కలిశారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ హోంమంత్రి జానారెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ హోంమంత్రి సబితారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.నియోజకవర్గంలో అత్యధిక జనాభా,ఓటర్లు ఉన్న బీసీలపై, ముదిరాజ్‌ సామాజికవర్గంపై రోహిత్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఈయన కారణంగా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top