ముందస్తుపై నమ్మకంలేదు

Tammineni veerabadram and chada venkata reddy on early elections - Sakshi

తమ్మినేని, చాడ వెంకటరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల పేరిట హడావుడి, ఆర్భాటం తప్ప ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం తమకు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మఖ్దూంభవన్‌లో ఇరుపార్టీల నేతలు గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల హడావుడి, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు, ఇరుపార్టీల మధ్య పొత్తులు, వామపక్ష ప్రజాతంత్ర కూటమి వంటివాటిపై చర్చించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడిన ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్‌ ఆర్భాటం చేస్తున్నారని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ మధ్య పొత్తుల గురించి చర్చించినట్టు వారు వెల్లడించారు. పొత్తుల్లో సీట్లు నిర్ణయించుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చునని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలన్నారు.

సెప్టెంబర్‌ 2న జనసేనతో సీపీఎం చర్చలు
భవిష్యత్‌ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సీపీఎం ప్రతినిధి వర్గం సెప్టెంబర్‌ 2న జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమవుతాయని గురువారం సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top