‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

Tamil Nadu parties cry foul over national policy on language formula - Sakshi

చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలుకు కేంద్ర ప్రయత్నిస్తోందంటూ తమిళ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ద్వి భాషా విధానాన్నే కొనసాగిస్తామని తమిళ సర్కార్‌ తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరిరంగన్‌ నేతృత్వంలో రూపొందించిన జాతీయ విద్యా విధానంలోని ప్రతిపాదనలు శుక్రవారం వెల్లడయ్యాయి. కొన్ని మార్పులు చేర్పులతో అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం (మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీ)అమలు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది.

దీనిపై తమిళనాడులోని పలు పార్టీల నేతలు స్పందించారు. ‘త్రిభాషా విధానం అమలు, హిందీని పాఠశాల స్థాయి నుంచి 12వ తరగతి వరకు నేర్వాలనడం పెద్ద షాక్‌. ఈ ప్రతిపాదన దేశాన్ని విభజిస్తుంది’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ‘పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు అర్థం ఏమిటి? హిందీని తప్పనిసరి చేయాలని చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం మొదట్లోనే బయటపడుతోంది’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం  అన్నారు.

అది ప్రతిపాదన మాత్రమే: కేంద్రం
త్రి భాషా సూత్రాన్ని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తమిళ పార్టీలు చేస్తున్న ఆరోపణను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ఖండించారు. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ముసాయిదాలో అది ఒక ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ‘మోదీ ప్రభుత్వం అన్ని భాషల అభివృద్ధిని కోరుకుంటోంది. ఎన్‌ఈపీ కమిటీ ప్రతిపాదనలపై అపోహలు అవసరం లేదు. అది ప్రతిపాదన మాత్రమే. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయిస్తాం’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top