నిండుతనం..చెరగని చిరునవ్వు సుష్మా స్వరాజ్

Sushma Swaraj Indian Women Politician - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతల్లో ప్రముఖంగా వినిపించే పేరు సుష్మాస్వరాజ్. పలు సందర్భాల్లో పార్టీ కీలక నేతగా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న సుష్మ రాజకీయాల్లోకి ప్రవేశానంతరం వెనుదిరిగి చూడలేదు. హరియాణా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కురాలిగా, ఢిల్లీకి బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో తొలి మహిళా ప్రతిపక్షనేతగా, అవుట్‌ స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌ అవార్డు స్వీకరించిన తొలి మహిళగా, క్రియాశీలకమైన రాజకీయవేత్తగా తనదైన శైలిలో రాణించారు.

సుష్మా స్వరాజ్‌ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులను, ముఖ్యంగా ఎమర్జెన్సీ,  పదమూడు రోజుల సంకీర్ణ  ప్రభుత్వం లాంటి ఒడిదుడుకులను ఆమె చాలా దగ్గరినుంచి పరిశీలించారు.  సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలుగా వన్నెకెక్కి తనదైన వాక్పటిమతో విపక్ష నేతలను సైతం ఆకట్టుకునే చాతుర్యం ఆమె సొంతం. అందుకే బెస్ట్‌ లవ్‌డ్‌ పొలిటీషియన్‌’, ‘బెస్ట్‌ అవుట్‌స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌’. అవార్డులు ఆమెను వరించాయి. దీంతోపాటు విదేశాంగ మంత్రిగా సోషల్‌ మీడియా  ప్లాట్‌ఫాంలో ట్విటర్‌ద్వారా పలు సమస్యలను  పరిష్కరిస్తూ స్మార్ట్‌ లీడర్‌గా  ఆకట్టుకున్నారు. ఈ  సందర్భంగా 2016లో ఆమెకు జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ట్విటర్‌ ద్వారా ఆమెకు లభించిన సానుభూతి, ఊరట ప్రస్తావించదగింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మన దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే స్మార్ట్‌గా సాయం అందించి అనేకమంది హృదయాలను గెలుచుకున్నారు. ఈ  నేపథ్యంలోనే 2015లో నేపాల్‌ భూకంపం సందర్భంగా సుష్మ స్పందించిన తీరు, అందించిన సేవలకు గాను స్పెయిన్‌ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డును 'గ్రాండ్ క్రాస్‌ను ఇటీవల అందుకోవడం విశేషం.  అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బీజేపీ తరపున గట్టిగా వాదించి ‘తెలంగాణ చిన్నమ్మ’ గా పేరు గడించారు.

రాజకీయ ప్రస్థానం
1977-82 హర్యానా శాసనసభ సభ్యురాలిగా క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంటు (రాజ్యసభ, లోక్‌సభ) సభ్యురాలిగా కాలిడి, 2014లో 16వ లోక్‌సభకు ఎంపికవరకూ ఆమె రాజకీయ పయనం అప్రతిహతమే. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని స్థానంలో ప్రతిపక్షనేతగా ఎంపికకావడం ఒక ఎత్తు అయితే..పలుమార్లు కేంద్రమంత్రిగా విజయవంతంగా సేవలందించడం మరో ఎత్తు. 

విప్లవాత్మక నిర్ణయాలు
దేశ రాజధాని నగరం ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ల తనిఖీలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.  సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్‌ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.  ఆరు ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఏర్పాటు చేశారు. 

వ్యక్తిగత వివరాలు
సుష్మాస్వరాజ్‌ తండ్రి హర్‌దేవ్‌ శర్మ (ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు), తల్లి లక్ష్మీదేవి. సుష్మ బాల్యం, కాలేజ్‌ చదువు అంతా అంబాలాలో సాగింది. మూడేళ్లు వరుసగా బెస్ట్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌ అవార్డు నుంచి బెస్ట్‌ హిందీ స్పీకింగ్‌ అవార్డు, బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డులను  సుష్మ గెల్చుకున్నారు. న్యాయవాది పట్టా పొందిన అనంతరం 1973లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్‌ లీగల్‌ డిఫెన్స్‌ టీమ్‌లో చేరడం... ఆమె జీవితంలో అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా  కీలక  మార్పులకు నాంది పలికింది. 1975, జూలై 13న  సహచర న్యాయవాది కౌశల్‌ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకుని సుష్మా స్వరాజ్‌గా మారడం అందులో ఒకటి. సుష్మ, స్వరాజ్‌  కౌశల్‌ దంపతులకు  బన్సూరి కౌశల్‌ కుమార్తె ఉన్నారు.

వివాదాలు
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా పత్రాలు త్వరగా మంజూరయ్యేలా సిఫారసు  చేశారన్న ఆరోపణలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. 2014లో భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలంటూ  మరో వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు ఆమె భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బాంసూరి స్వరాజ్‌లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా నియమించుకున్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై   సుష్మ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ 2015తలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గత ఏడాది మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  ఆరోగ్యరీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ అనూహ్యంగా ప్రకటించారు.

ఇష్టాలు
సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు.  సుష్మ స్వరాజ్‌కు జ్యోతిషశాస్త్రంపై ధృడమైన నమ్మకం. భోంచేసినా, దుస్తులు ధరించినా అన్నీ దీనికనుగుణంగానే చేస్తారట.
- టి. సూర్యకుమారి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top