పోటాపోటీ

Stiff Competition In TRS seat sharing In Medak - Sakshi

ఒక్కో స్థానానికి సగటున ముగ్గురు పోటీ

అభ్యర్థిత్వాల ఖరారులో గందరగోళం

తలపట్టుకుంటున్న  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  

కాంగ్రెస్, బీజేపీల్లో భిన్న పరిస్థితులు

పలు చోట్ల అభ్యర్థుల కోసం వెతుకులాట

ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వాల ఖరారు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానానికి సగటున ముగ్గురు చొప్పున టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌... అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఖరారుపై ‘గులాబీ’ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఇదేక్రమంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో ఇంకా నిశ్శబ్దం వీడని పరిస్థితి ఉంది. –సాక్షి, మెదక్‌
   
ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ.. అందులోనూ ఘన విజయం సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో ఉంది. ఇలా వరుస ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న     క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో విజయం నల్లేరుపై నడకేనని  భావిస్తున్న టీఆర్‌ఎస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులు అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీసీ పదవులకు పోటీచేసేందుకు ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల జెడ్పీటీసీ పదవిని నలుగురైదుగురు.. ఎంపీటీసీ పదవిని ఐదారుగురు ఆశిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్, బీజేపీలో భిన్న పరిస్థితులు
వరుస ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతుంటే.. వరుస ఓటమితో కాంగ్రెస్, బీజేపీల్లో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. గుర్తింపు ఉన్న నేతలైనప్పటికీ.. ఎన్నికల్లో పోటీచేసి నెగ్గగలమా,  పైసలు దండగ అంటూ పలువురు పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కొన్ని మండలాల్లో బరిలో దిగేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల అభ్యర్థుల కో సం హస్తం, కమలం నేతలు వెతుకులాటలో నిమగ్నమైనట్లు సమాచారం.  జెడ్పీటీసీ స్థానాలపై మొ గ్గు చూపిస్తున్నప్పటికీ.. ఎంపీటీసీ బరిలో నిలిచే ందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

మండలాల పరిధిలో ఇలా..
రేగోడు మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఈ స్థానం నుంచి టికెట్‌ను అధికార పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆశి స్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ మండల పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒక్కోస్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు మాత్రమే టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. 

పెద్దశంకరంపేట మండలంలో జెడ్పీటీసీ పదవిపై టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి సైతం ముగ్గురు ఆశావహులు టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మండల పరిధిలో 12 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్దశంకరంపేట మేజర్‌ పంచాయతీ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్రులుగా నామినేషన్‌ వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. 

చిన్నశంకరంపేట మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జనరల్‌  మహిళలకు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ పదవిని టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు మహిళలు ఆశిస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ పదవిని టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఆశిస్తున్నట్లు తెలిసింది. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు చొప్పున మాత్రమే టికెట్‌ కోసం పోటీపడుతున్నట్లు సమాచారం.

శివ్వంపేట జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్‌గా రిజర్వ్‌ అయ్యాయి. టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీపీ పదవిని నలుగురు, జెడ్పీటీసీ పదవిని ఐదుగురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుతం ఒక్కరు మాత్రమే టికెట్‌ను ఆశిస్తున్నారు. 

నర్సాపూర్‌ మండలంలో జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వేషన్‌ అయింది. తుల్జారంపేట తండాకు చెందిన ఒకరు.. నంద్యా తండాకు చెందిన మరొకరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి లింగాపూర్‌ తండాకు చెందిన ఒకరు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎంపీపీ సైతం ఎస్టీ మహిళకు రిజర్వేషన్‌ కాగా.. ఇద్దరు మాజీ ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్ల వేటలో మునిగినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. బీజేపీలో ఇప్పటివరకు చలనం లేదు.

వెల్దుర్తి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. ఎంపీపీ పదవిని టీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. జెడ్పీటీసీ పదవులను టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఆశిస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ పదవులకు సంబంధించి టీఆర్‌ఎస్‌లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఒక్కో స్థానంలో ముగ్గురు చొప్పున బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top