తాజ్ మహల్ కట్టిన చేతుల్ని నిజంగా నరికేశారా?

special story on taj mahal controversy

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ చుట్టూ అల్లుకుపోయిన మంచి, చెడు కథలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. 17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ బేగమ్ పేరిట ఈ సుందర స్మారక భవనాన్ని నిర్మించిన షా జహాన్ (షాహబ్ ఉద్దీన్ ముహమ్మద్ కుర్రమ్) తన తండ్రిని చెరసాలలో బంధించిన దుర్మార్గుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవానికి షా జహాన్ తన తండ్రి జహంగీర్ను చెరసాలలో బంధించలేదు. షా జహాన్నే ఆయన కుమారుడు ఔరంగా జేబు బంధించారనే విషయం చరిత్ర పుస్తకాలు చదువుకోని భారతీయుల కూడా తెలుసు.

మొఘల్ చక్రవర్తులది తనయులను చంపేసే తండ్రుల సంస్కృతంటూ ప్రముఖ హిందూత్వ వాది, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, సంగీత్ సోమ్ను సమర్థించారు. తండ్రులను చెరసాలల్లో బంధించారే తప్ప తండ్రులను చంపిన మొఘల్ రాజుల గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇంకా రాజ్యం కోసం తండ్రులను చంపిన తనయుల చరిత్ర రాజ్పుత్లకే ఉంది. మెవార్ రాజు రాణా కుంభాను క్రీస్తుశకం 1468లో ఆయన కుమారుడు ఉదయ్ సింగ్ చంపేశారని, క్రీస్తు శకం 1724లో మార్వార్ రాజు అజిత్ సింగ్ను ఆయన కుమారులు భక్త్ సింగ్, అభయ్ సింగ్లు కలిసి చంపేశారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి.  ఆస్తుల కోసం తండ్రులను చంపేసే సంస్కతి ఇప్పటికీ భారతీయుల్లో కనిపిస్తోంది.

దినేష్ శర్మ మరో అడుగు ముందుకేసి షా జహాన్ తాజ్ మహల్ను నిర్మించిన కూలీల రెండు చేతులను నరికేయించారని వ్యాఖ్యానించారు. అలాంటి అందమైన నిర్మాణాన్ని మరో చోట నిర్మించకూడదనే భావంతోనే కూలీల చేతులను నరికేయించారన్నది తెలిసీ తెలియని శర్మ లాంటి వ్యక్తుల అభిప్రాయం. తాజ్ మహల్ను నిర్మించడానికి ముందే షా జహాన్కు మంచి బిల్డర్గా పేరుంది. అప్పటికే ఆయన ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, అజ్మీర్లో దాదాపు డజన్ కట్టడాలను పూర్తి చేశారు. ఒక కట్టడమయ్యాక అక్కడి నుంచి మరో చోటుకు కూలీలను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. కూలీలకు నిరంతరం పని కల్పించడ వల్ల వారిలో పని నైపుణ్యం పెరుగుతుందని, పైగా ఒకే వ్యక్తి వద్ద ఎక్కువ కాలం పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తారని కూడా ఆయన నమ్మేవారని చరిత్రకారులే చెప్పారు.

ఈ రోజుల్లో లాగా నైపుణ్యం కలిగిన కూలీలు అప్పుడు పెద్దగా దొరికేవారు కాదు. అలాంటప్పుడు తాజ్ మహల్ లాంటి మహా సౌధాన్ని కట్టిన చేతులను బుద్ధి ఉన్నవారు ఎవరూ నరక్కోరు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అప్పటికే ప్రముఖుడైన జోహాన్నెస్ డీ లాయెత్ లాంటి యూరప్ చరిత్రకారులు ఆ సంఘటనను కచ్చితంగా నమోదు చేసేవారు. అప్పటి యూరప్ చరిత్రకారులు ఇలాంటి పుకార్లకు, రాజుల ప్రేమ పురాణాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు. ముంతాజ్ బేగమ్ మరణించాక షా జహాన్ తన పెద్ద కూతురు జహనారా బేగమ్ల ప్రణయ గాధలు అంటూ ప్రచారం చేసిన చరిత్రకారులు వేల మంది కార్మికుల చేతులను నరికితే పట్టించుకోరా? అప్పుడు ప్రచారంలో ఏ మాత్రంలేని షా జహాన్ ఘోర కృత్యం గురించి కొన్ని దశాబ్దాల తర్వాత ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? పైగా షా జహాన్, కూలీలకు ఇతరుల కన్నా ఎక్కువ వేతనాలిచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. అందుకేనేమో బ్రిటిష్ పాలకుల హయాంలోకన్నా షా జహాన్ కాలంలోనే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువని ఆర్థిక గణాంకాలే తెలియజేస్తున్నాయి (17వ శతాబ్దాన్ని 19వ శతాబ్దంలోని భారత ఆర్థిక వ్యవస్థ పోల్చి చూడండి!).

షా జహాన్ విదేశీయుడని సోమ్, శర్మ కూటమి పేర్కొంది. తన జీవితాంతం భారత ఉపఖండంలోనే జీవించిన ఆయనకు మూగ్గురు రాజ్పుత్ తాతలు, ఒక పర్షియన్, ఆసియన్ తాత కూడా ఉన్నారు. లియో వర్ద్కర్ ఐరిస్ అని, బరాక్ ఒబామా అమెరికన్ అని ఒప్పుకుంటే షా జహాన్ను కూడా భారతీయుడని ఒప్పుకోవాల్సిందే. ఓ అద్భుతమైన కట్టడం వెనక ఓ చీకటి కోణం దాగుందని చెప్పడం మానవ సంస్కృతిలో భాగంగా కనిపిస్తోంది. మాస్కోలోని ప్రముఖ సెయింట్ బేసిల్స్ కెథడ్రల్కు ఆర్కిటెక్ట్గా వ్యవహరించిన తన కుమారుడైన పోస్తిక్ యకోవ్లెÐŒ ను రష్యా జారు చక్రవర్తి ఇవాన్ ది టెరిబుల్ చంపాలనుకోవడం కూడా అలాంటిదే. బాంబేలోని తాజ్ మహల్ హోటల్కు కూడా అలాంటి కథనే అల్లారు. తాను గీసిన ప్లాన్ను ముందు భాగాన్ని వెనక్కి, వెనక భాగాన్ని ముందుకు కట్టారని తెలిసి దాని ఆర్కిటెక్ట్ తాజ్మహల్ హోటల్ పైనుంచి దూకి చనిపోయారని చెబుతారు. తాజ్ మహల్ ఒకప్పటి ‘తేజో ఆలయం’గా పిలిచే శివాలయం అనే వాదనలో ఎంత నిజం ఉందో, కార్మికుల చేతులు నరకడంలోనూ అంతే నిజం ఉంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడంతో మొదలైన ‘తాజ్ మహల్’ వివాదం ప్రధాని జోక్యంతో చివరకు తన మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించారేమో భారతీయుల రక్తం, స్వేదంతో తడిసిన తాజ్ మహల్ను రక్షించాల్సిన బాధ్యత తన రాష్ట్రానిదేనని చెప్పారు. పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి దాన్ని తొలగించినప్పుడు అనవసరంగా ఓ సమాధిని రక్షించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అర్థరహితమన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా సమయానుకూలంగా వ్యవహరించడం తెలివైన రాజకీయ నేతల పని. అంత రక్తంతోకాకపోయిన కార్మికుల స్వేదంతో తడిసిన సౌధాన్ని ఏ దేశమైనా రక్షించుకోవాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top