జనసేన, టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నాం: తమ్మినేని

Sitaram Yechury Fires On BJP Over Pulwama Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పుల్వామా ఘటనను ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియటం లేదంటూ బీజేపీపై మండిపడ్డారు. ఒక మతానికి సంబంధించిన వారు జవాన్‌లపై దాడి చేయలేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  జాతీయ  భద్రత దృష్ట్యా పుల్వామాలో జరిగిన సంఘటనను విద్రోహ చర్యగా పేర్కొన్నారు. ​అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ​దేశం మొత్తం ఐక్యంగా ఉంటే బీజేపీ మాత్రం రాజకీయం చేయాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ​‘బీజేపీ ప్రభుత్వం ఇది.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు’ అన్న అమిత్ షా మాటలను తప్పుబట్టారు. సంఘటనను బీజేపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారన్నారు. ​ఈ సంఘటనతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నారు.

నాలుగేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందని ప్రశ్నించారు. ​కాశ్మీర్‌లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఎవరూ ఉగ్రవాదుల ట్రాప్‌లో పడకూడదని కోరారు. ​బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో జవాన్‌లు చనిపోయారని తెలిపారు. ​ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. మాది సెక్యులర్ పార్టీ. ఎన్నికల ముందు కేసీఆర్ లాంటి ఫెడరల్ ఫ్రంట్లు చూస్తూనే ఉంటాము.​ బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. వామపక్షాలు పార్లమెంట్లో ఉండేలా కార్యాచరణ రచిస్తున్నాం. ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుంది. 2019  ఎన్నికల తరువాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్‌లో కలిసి పోటీ చేయడంపై  సీపీఐతో చర్చలు జరుగుతున్నాయి. ​ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు. ఎలక్షన్ కమీషన్ అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేయాలి.

జనసేన, టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నాం: తమ్మినేని
ఎంపీ ఎలక్షన్లలో కలిసి పోటీ చేసే విషయంపై  జనసేన, తెలంగాణ జనసమితి పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ​రాబోయే ఎన్నికల్లో కూడా బీఎల్‌ఎఫ్‌తో దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ​చాడ వెంకట్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సానుకూలంగా  స్పందించారని వెల్లడించారు. ​అధికారంలోకి రాకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ​10 టీవీ సీపీఎం పార్టీది కాదని, సీపీఎం పార్టీగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదన్నారు. ​విరాళాలు తీసుకుని టీవీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నష్టంలో ఉన్నందున 10 టీవీని అమ్మి వేసినట్లు చెప్పారు. ​సేకరించిన విరాళాలు తిరిగి ఇస్తున్నామని, ​త​మపై వచ్చిన వార్తలు ,సోషల్ మీడియాలో వచ్చినవి.. ఒక పేపర్‌లో వచ్చిన వార్తలు సరైనవి కావన్నారు. ​తాము టీవీ ద్వారా నష్టపోయామని పొలిట్ బ్యూరోకి చెబితే.. 10 టీవీని  అమ్మి వేయండని పోలిట్ బ్యూరో సలహా ఇచ్చినట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top