ఐ యామ్‌ హ్యాపీ : సిద్ధరామయ్య

Siddaramaiah Comments On Coalition Govt After Videos Go Viral - Sakshi

సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్- జేడీఎస్‌ సంకీర్ణ సర్కారులో విభేదాలను రూపుమాపేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కన్పిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామిని విమర్శిస్తూ తాను చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్దరామయ్య యూటర్న్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదని, తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేపీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం సిద్దు మీడియాతో మాట్లాడారు.

‘నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు. సీఎం కుమారస్వామి, సంకీర్ణ ప్రభుత్వం గురించి నేను ఏ సందర్భంలో అలా మాట్లాడానో మీకు అర్థంకావడం లేదు. నా వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం కూడా మీకు తెలియదు. అయినా ఒక వ్యక్తిగా నా అభిప్రాయాలను చెబుతున్నపుడు వీడియోలు తీయడం నైతికత అనిపించుకోదంటూ’  సిద్దు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ బీజేపీ నుంచి కన్నడ ప్రజలను రక్షించేందుకు కాంగ్రెస్‌- జేడీఎస్‌లు ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని.. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామి, సంకీర్ణ ప్రభుత్వం గురించి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో కూటమిలో చీలికలు వచ్చాయంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదంతా మీడియా కల్పన అని, తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కూడా తాను సిద్థంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు సిద్దరామయ్య కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్‌- జేడీఎస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top