బాబు కుట్ర రాజకీయాలకు అంతే లేదు

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

కరోనా నియంత్రణలో రాష్ట్రం కృషిని జాతీయ మీడియా గుర్తించింది

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అంతే లేకుండా పోయిందని.. సంక్షోభంలో కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే.. చంద్రబాబులా తమది పబ్లిసిటీ ప్రభుత్వం కాదని పని చేసే ప్రభుత్వమని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు నిర్దిష్ట ప్రాతిపదిక లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

కరోనా విషయంలో ఫిబ్రవరి చివరి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కరోనా నియంత్రణకు చక్కగా ఉపయోగపడ్డాయి. 
► చంద్రబాబు తన హయాంలో చేసుకున్నదంతా ప్రచారమే తప్ప మరేమీ లేదు. మరోవైపు రాజకీయ జోక్యం లేకుండా వైఎస్‌ జగన్‌ అంకితభావంతో పనిచేస్తున్నారు.  
► మీడియా తనను ఎక్కడ మర్చిపోతుందోనని చంద్రబాబు జూమ్‌ యాప్‌ ద్వారా సందేశాలు ఇస్తూ లేఖలు రాస్తున్నారు. లోపాలుంటే ఎత్తిచూపవచ్చు కానీ ఆయన మాట్లాడుతున్నవన్నీ అవాస్తవాలే. కరోనా పరీక్షల్లో రాష్ట్రం వెనుకబడి ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 
► మూడు విడతల సర్వేలు జరిగాయి. 33 వేల మంది అనుమానితుల్లో దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారిలో 24 వేల మందికి ప్రభుత్వం పరీక్షలు చేసింది. వారే కాదు మిగిలిన 9 వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.
► రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 2 వేల పరీక్షలు చేశారు. దేశమంతా రోజుకు 15 వేల పరీక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రోజుకు వేయి చేయిస్తోంది. 
► లక్షకుపైగా పీపీఈలు స్టాక్‌ ఉన్నాయి. మాస్కులు, ఇతర సామాగ్రి కూడా సిద్ధం చేసింది. 
► కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని స్థానిక మీడియా గుర్తించకపోయినా జాతీయ మీడియా గుర్తించింది. 
► చంద్రబాబు రోజూ రాజకీయాలే మాట్లాడుతున్నారు. పైగా ప్రధానికి తాను సలహా ఇచ్చానని చెప్పుకుంటున్నారు. అఖిలపక్షం పెట్టాలని కోరుతున్న చంద్రబాబుకు ఆ హక్కే లేదు. ఆయన హయాంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీని ఒక్కసారైనా సంప్రదించారా? ఇప్పటికైనా జనం తనను పక్కన పెట్టేశారనే వాస్తవాన్ని గ్రహించి తన కుమారుడి కోసం ఆయన రిటైర్‌ కావాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top