వంతాడలో రూ.3 వేల కోట్ల అక్రమ మైనింగ్‌

Rs 3,000 crore illegal mining at Vanthada - Sakshi

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌

ముఖ్యమంత్రికి తెలియకుండా అంతపెద్ద మైనింగ్‌ జరుగుతుందా?

అక్కడి మైనింగ్‌ డబ్బులు ఎవరి జేబులోకి వెళుతున్నాయి

జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు

సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంత గ్రామమైన వంతాడలో ఏడాదికి రూ.3 వేల కోట్ల విలువైన అక్రమ మైనింగ్‌ జరుగుతోందని.. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం మాత్రం అక్కడ అసలు మైనింగ్‌ జరగడం లేదని అబద్ధాలు చెబుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ధ్వజమెత్తారు. అక్కడ మైనింగ్‌ డబ్బులు ఎవరి జేబులకు వెళుతున్నాయంటూ ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా, లేక లోకేష్‌కు మాత్రమే తెలిసి చేయిస్తున్నారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలరాజు శనివారం విజయవాడలో పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పవన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వంతాడలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న సంస్థ స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటోందని చెప్పారు. ఆ అక్రమ మైనింగ్‌ ద్వారా ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆదాయం రావడం లేదన్నారు. గిరిజనులకు మంచినీరు ఇచ్చే పైపులైను ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు ఉంటాయి కానీ, రిజర్వుడ్‌ పారెస్టులో అటవీ శాఖ అనుమతి లేకుండా అక్రమ మైనింగ్‌ జరిగే ప్రాంతానికి పెద్ద ట్రక్‌లు కూడా వెళ్లే రోడ్లు వేసి ఉన్నాయన్నారు. అక్రమ మైనింగ్‌ చేసే వారికి ప్రభుత్వం అంతగా రెడ్‌ కార్పెట్‌ పరుస్తుంటే, దానిని ఏమంటారు? అది అవినీతి కాదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరగకుండా చూస్తామన్నారు. జనసేనతో కలిసి పనిచేయడానికి బాలరాజు ముందుకు రావడం సంతోషమన్నారు. 

తెలంగాణలో మద్దతివ్వమంటున్నారు..
తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమైన పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు జనసేన మద్దతు కోరుతున్నారని పవన్‌  చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరిని 2–3 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 23 అసెంబ్లీ, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్నామని, అయితే అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో ఆ ఆలోచన మార్చుకున్నామని తెలిపారు. జనసేన పార్టీలో చేరిన బాలరాజు మాట్లాడుతూ.. పవన్‌ మొదలు పెట్టిన రాజకీయ ప్రస్తానంలో భాగస్వామి కావాలనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్, ఉత్తరాంధ్ర జనసేన కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top