స్పీకర్‌ను అవమానించడం వారికి మామూలే

RK Roja Fires On Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆర్కే రోజా 

ఈ రోజు తమ్మినేనిని అగౌరవ పరిచిన తీరు ప్రజలంతా చూశారు

గత ఐదేళ్లలో టీడీపీ వారు మాట్లాడిన మాటలకు ఎన్ని గుంజీలు తీసినా సరిపోదు

ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజే ఇంత అసహనమా?

సాక్షి, అమరావతి: స్పీకర్‌ను అవమాన పరచడం, ఆ స్థానాన్ని దుర్వినియోగం చేయడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ప్రసంగించారు. ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని ఉదాహరణలుగా తీసుకుంటామని.. స్పీకర్‌కు అభినందనలు తెలిపే అంశంలో తమ ఎమ్మెల్యేలు చెప్పిన మాటల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదన్నారు. స్పీకర్‌ కుర్చీని అవమానించడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన్ను గౌరవించక పోవడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు.

ఈ రోజు తమ్మినేనిని అగౌరవ పరిచిన తీరును సైతం ప్రజలు చూశారని చెప్పారు. ఇలా చేయడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘ఎంతో అనుభవం.. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని స్పీకర్‌గా ఎన్నికైనందుకు అంతా సంతోషించాలి.. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లావాసులు చాలా ఆనందపడాలి. కానీ తమ్మినేని సభాపతి అయినందుకు అచ్చెన్నాయుడికి సంతోషం కంటే కడుపుమంటే ఉన్నట్టు ఆయన మాటల్లో కనబడుతోంది. తన తోటి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏదో మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలంటున్నారే.. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు ఎన్ని రోజులు గుంజీలు తీసి, చెంపలు లెంపకాయలు వేసుకున్నా సరిపోదు’ అన్నారు. 

చరిత్ర గుర్తుకు తెచ్చుకోండి..
గతంలో సభాపతి కుర్చీని ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే రోజా అన్నారు. ‘ఫొటోలు పెట్టుకుని, వర్ధంతికి, జయంతికి ఎన్టీఆర్‌ గురించి గొప్పగా మాట్లాడటమే కానీ.. ఆయన స్థాపించిన పార్టీలో.. అప్పుడు సీఎంగా ఉన్న ఈ సభలో ఆయన్ను వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కుని స్పీకర్‌ స్థానాన్ని అడ్డుపెట్టుకుని అవమానించారు. చరిత్ర ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎన్టీఆర్‌ మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా యనమల రామకృష్ణుడిని అడ్డుపెట్టుకుని సభాపతి స్థానాన్ని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు.  కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవçహారంపై గత అసెంబ్లీలో నేను వాయిదా తీర్మానం ఇచ్చాను.

ఆ వ్యవహారంలో చంద్రబాబు.. ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు స్పీకర్‌ స్థానాన్ని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా నన్ను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడం న్యాయమా? ఈ కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మధ్యంతర తీర్పుతో నేను అసెంబ్లీలోకి వస్తే కనీసం న్యాయస్థానం ఆదేశాలను సైతం గౌరవించలేదు. లోపలికి రానీయకుండా మార్షల్స్‌తో అడ్డుకున్నారు. అలాంటి వీరు ఈ రోజు సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గత ఐదేళ్లూ అహంకారంతో ప్రవర్తించి, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజుకే ఇంత అసహనం ఎందుకు? ఎంతో గౌరవంతో మా ప్రియతమ నేత జగన్‌ అన్ని విషయాల్లో, ప్రతిఒక్కరినీ గౌరవిస్తూ సామాజిక న్యాయం చేస్తూ ముందుకెళ్తుంటే ప్రతి దాన్నీ రాజకీయం చేస్తారా? హుందాగా వచ్చి స్పీకర్‌ను కూర్చోబెట్టొచ్చు కదా? ప్రజాస్వామ్య వ్యవస్థకు అధికార, ప్రతిపక్షం రెండు కళ్లు లాంటివి. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం అందరికీ ఇవ్వాలని కోరుతున్నా’ అని రోజా అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top