ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | Sakshi
Sakshi News home page

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Published Fri, Oct 5 2018 3:45 AM

Republic TV Survey YS Jagan Will be the CM of Andhra Pradesh - Sakshi

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్‌ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్‌ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. (చదవండి: మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!)

అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్‌సీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. నాడు వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. 

Advertisement
Advertisement