పేదల పెన్నిధి నారాయణరెడ్డి

Raketla Narayana Reddy Death Anniversary Anantapur - Sakshi

రైతుల తరఫున  అనేక పోరాటాలు

ఓర్వలేక పొట్టనపెట్టుకున్న భూస్వాములు

నేడు రాకెట్లలో నారాయణరెడ్డి 23వ వర్ధంతి

తండ్రి స్ఫూర్తితోనే  ప్రజా సేవలో కుమారులు

పోరాటం ఆయన పంథా..అన్యాయాన్ని ప్రశ్నించడం ఆయన నైజం.. రైతుల కష్టాల్లో పాల్పంచుకుంటూ.. నిరుపేదలకు అండగా నిలిచి భూస్వాములగుండెల్లో నిద్రపోయిన రాకెట్ల నారాయణరెడ్డి త్యాగం చిరస్మరణీయం. విద్యార్థి నేతగా..వామపక్ష పార్టీ నాయకునిగా పాలకులపై రాజీలేని పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. భూస్వాముల కుట్రకు బలై నేటికి 23సంవత్సరాలు గడిచినా ‘అనంత’ మదిలో ఆయన ఇప్పటికీ సజీవం.

అనంతపురం:  రైతు కుటుంబంలో జన్మించిన రాకెట్ల నారాయణరెడ్డి తన జీవితాంతం పేదల సంక్షేమం, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశారు. 1945–49 సంవత్సరాల్లో విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పని చేశారు. 1950 నుంచి అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడిగా ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేశారు. దళిత విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేయాలని నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమాలు జరిగాయి. అనంతర కాలంలో కమ్యూనిస్టు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆదోని దగ్గరలోని బసాపురం గ్రామానికి చెందిన లలితమ్మతో నారాయణరెడ్డి వివాహం జరిగింది. ఆమె కూడా నారాయణరెడ్డి ఉద్యమానికి సహకరించడంతో పోరాటమే తన పంథాగా మార్చుకున్నారు. 1963లో అధిక శిస్తు నిర్మూలన కోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్‌ అయ్యారు. గ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహాన్ని పోరాడి సాధించారు. అలాగే రాకెట్ల చుట్టుపక్కల సుమారు 15 గ్రామాల్లో పెత్తందార్ల దౌర్జన్యాలను ఎదురొడ్డి పోరాడారు. ముఖ్యంగా దౌర్జన్యంతో బోర్లు పూడ్చడం, అక్రమంగా వివిధ చెట్లు నరికివేత, అక్రమంగా కల్లు గీయించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. పార్టీపై నిషేధం విధించిన రోజుల్లో ప్రభుత్వం అరెస్ట్‌ చేయగా..చాలాకాలం జైల్లో గడిపారు.

సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌గా...
రాకెట్ల సింగిల్‌ విండో ప్రెసిడెంటుగా పనిచేసిన నారాయణరెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండ తాలూకా సీపీఐ కార్యదర్శిగాæ చాలా ఏళ్లు పని చేశారు. కౌకుంట్లలో మిగులు భూములను పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో పోరాటం ప్రారంభించారు. చల్లపల్లి జమీందార్లపై జరిగిన భూపోరాటం తర్వాత అతిపెద్ద భూపోరాటం కౌకుంట్లలో జరిగింది. ఈ ఉద్యమంలో నారాయణరెడ్డితో పాటు చండ్రరాజేశ్వరరావు నల్లమల గిరిప్రసాద్, ఆంజనేయశాస్త్రి, నీలం రాజశేఖర్‌రెడ్డి, వీకే ఆదినారాయణరెడ్డి, సదాశివన్‌ పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కౌకుంట్లలో 1,200 ఎకరాల భూమిని స్వయంగా ‘భూ సమారాధన’ పేరుతో పేదలకు పంపిణీ చేశారు. అప్పటి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు దాసరి నాగభూషణం, కొరటాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ పోరాటం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రతిష్టను మరింతగా పెంచింది.  

భూస్వాముల ఆక్రోశానికి బలి
నారాయణరెడ్డి చేస్తున్న పోరాటాలతో ఓ వైపు పేదల మద్దతు పెరుగుతుండగా.. మరోవైపు భూస్వాముల ఆక్రోషం కూడా పెరిగింది. వ్యవసాయాన్ని పక్కనపెట్టిన నారాయణరెడ్డి పూర్తిగా పార్టీ పనిలో నిమగ్నమయ్యారు. తన పిల్లలను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంతో వారు రాష్ట్ర నాయకత్వ స్థాయికి ఎదిగారు. అన్యాయం ఎక్కడ జరిగినా వాలిపోవడం తన జీవన విధానంగా మార్చుకున్నారు. భూస్వాములు ఆయన్ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీయాలనుకున్నారు. ఈ క్రమంలో 1995 మే 24న నారాయణరెడ్డితో పాటు ఆయన కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిని హత మార్చారు. భౌతికంగా హత్య చేసినా పోరాటాల ద్వారా నారాయణరెడ్డి సాధించిన ఫలితాలు ప్రజలు పొందుతున్నంత కాలం వారి గుండెల్లో జీవించే ఉంటారు.   

తండ్రి స్ఫూర్తితో ఉద్యమ బాట

  • జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇవ్వాలంటూ ఉరవకొండలో 36 గంటల దీక్ష.
  • బెళుగుప్ప మండల కేంద్రంలో 25 గంటల జలజాగరణ, వజ్రకరూరు మండలం పొట్టిపాడులో 25 గంటల జలజాగరణ, వేలాది మంది ఆయకట్టు రైతులతో కలిసి రాగులపాడు లిప్ట్‌ ముట్టడి.
  • హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌తో జలసంకల్ప పాదయాత్ర పేరిట నియోజకవర్గం మొత్తం వందలాది మంది రైతులతో పాదయాత్ర.
  • అనంతపురంతో పాటు కూడేరు మండల దాహార్తి తీర్చేందుకు రూ.56 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మందితో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ముట్టడి.
  • ఉరవకొండలోని అర్హులైన నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, వివిధ వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్‌తో రోడ్ల దిగ్బంధం.

ప్రజలే దేవుళ్లు
మా నాన్న స్ఫూర్తితో ఉద్యమాలే ఊపిరిగా ముందుకెళ్తున్నాం. ప్రజలనే దేవుళ్లుగా భావించి సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేను కావడంతో అభివృద్ధికి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తోంది. దివంగత వైఎస్‌ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏటా ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులు కేటాయించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా ప్రజల తరపున పోరాటం సాగిస్తున్నాం.– వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే

తండ్రి బాటలో తనయులు
తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న నారాయణరెడ్డి తనయులు ప్రజల కోసం నిత్యం పరి తపిస్తున్నారు. వై.విశ్వేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యేగా  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూన్నారు. కొందరి ప్రజాప్రతినిధులను కలవాలంటే పీఏ, అనుచరుల అనుమతులు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. కానీ విశ్వేశ్వరరెడ్డిని కలవాలంటే అలాంటి అనుమతులేవీ అక్కర్లేదు. ఎవరైనా సరే నేరుగా వెళ్లి  ఆయన పక్కన కూర్చుని మాట్లాడేంత చనువు కల్పించారు. అందువల్లే ఆయనపై నియోజకవర్గ ప్రజలు మరింత విశ్వాసం పెంచుకున్నారు. ముఖ్యంగా హంద్రీ–నీవా సాగునీటి కోసం విశ్వేశ్వరరెడ్డి చేసిన ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. స్థానికంగా నీళ్లు ఇవ్వకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డి కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు.

నేడు రాకెట్లలో వర్ధంతి కార్యక్రమం
రాకెట్ల నారాయణరెడ్డి 23వ వర్ధంతిని గురువారం ఉరవకొండ మండలం రాకెట్లలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top