
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ప్రజలతో మమేకమైన నాయకుడికి బలం ప్రజలే అని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరూపించారని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. వైఎస్సార్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇంటర్వ్యూ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. జనం నుంచి ఎదిగిన నేతగా రాజశేఖరరెడ్డిని అభివర్ణించారు. 2004 ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు లేకపోయినా.. గెలిపించి చూపించిన సాహసోపేత నేతగా పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాజశేఖరరెడ్డి గురించి ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘2003లో అనుకుంటా.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవడం అంత సులభం కాదనే అభిప్రాయంతో వారంతా ఉన్నారు. కేంద్రం (వాజ్‌పేయి నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం) అండదండలు పుష్కలంగా ఉండటంతో భారీగా నిధులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అందుతున్నాయని చెప్పడం విన్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాను.
మీ పార్టీ అధిష్టానం పెద్దలకే గెలుపు పట్ల పెద్దగా నమ్మకం లేదు కదా! మీ నమ్మకం ఏమిటి? మీ పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారా? అని అడిగాను. ‘నాకు నా రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం ఉంది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రజలు నాతో ఉంటే నన్ను, పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమయింది.
2004–2014 వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉందంటే.. అది రాజశేఖరరెడ్డి చలువే. ఆయనకు పార్టీ రుణపడి ఉండాలి. ఆయన లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం అందేది కాదు.