ఖట్టర్‌ వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌

Rahul Gandhi Says Women Are not Assets to be Owned - Sakshi

న్యూఢిల్లీ: కశ్మీరీ అమ్మాయిలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఖట్టర్‌ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ‘కశ్మీర్‌ యువతులపై హరియాణా సీఎం ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాద’ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.  

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్‌ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్‌ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతార’ని మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top