బీసీలు కోరినవన్నీ చేసిన వైఎస్‌

R Krishnaiah Comments about YSR Welfare Schemes to BCs - Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య వెల్లడి

తండ్రి అడుగుజాడల్లోనే వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారని ప్రశంస

17న ఏలూరులో జరిగే బీసీగర్జనకు కృష్ణయ్యను ఆహ్వానించిన వైఎస్సార్‌సీపీ నేతలు

హైదరాబాద్‌: ‘‘దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీలకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. చరిత్రాత్మకమైనది. బీసీలు ఏది కోరితే అది చేసిన మహోన్నత వ్యక్తి. విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరైన వైఎఎస్సార్‌ మాదిరిగానే.. ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందుకే ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ నెల 17న ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ గర్జనకు హాజరవుతాను’’ అని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లో ఆర్‌.కృష్ణయ్యను కలసి బీసీ గర్జన సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందుకు కృష్ణయ్య అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనపై కృషి చేయాలని పార్లమెంటులోని 36 రాజకీయ పార్టీల్ని కోరితే వైఎస్సార్‌సీపీ తప్ప ఇతర ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని గుర్తు చేశారు.

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటూ వైఎస్సార్‌సీపీ చర్చకు పట్టుపట్టిందని, అయినా ఫలితం లేకపోవడంతో పార్టీపరంగా ప్రైవేటుబిల్లు పెట్టి చర్చకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్‌ అని ప్రశంసించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి, మాట్లాడడానికి అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్న సమయంలో జగన్‌ మాత్రం జనాభా ప్రకారం సీట్లు ఇస్తామని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ధైర్యంగా ముందుకొచ్చారని అభినందించారు.

గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు కలిసి బీసీ అభ్యర్థులనే నిలబెడదామని జగన్‌ ఓపెన్‌ చాలెంజ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణయ్యను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ రాయలసీమ రీజియన్‌ బీసీ విభాగం కోఆర్డినేటర్‌ తొండమల్ల పుల్లయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు లీలాకృష్ణ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా వెంకటకోటయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top