
హైదరాబాద్: బీసీ కమిషన్‌కు పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధత కల్పించడంలో లోక్‌సభ, రాజ్య సభల్లోని బీసీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిలబెట్టుకోలేదని విమర్శించారు.
బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండానే సభలను మార్చి 5 వరకు నిరవధికంగా వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్ లో జరిగిన బీసీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రూ.20వేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు మార్చి చివరి వారంలో పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, రాజేందర్, బిక్షపతి తది తరులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వేములవాడ మదన్‌మోహన్ నియమితులయ్యారు.