భర్త ప్రచారం చేయకూడదా ?

Puhalendi Petition in Madras High Court - Sakshi

హైకోర్టు వ్యాఖ్య ప్రచారాన్ని అడ్డుకోవాలని కోర్టులో పుహలేంది పిటిషన్‌

బాలకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా దాఖలు

విచారణకు స్వీకరణ పిటిషనర్‌ వాదనల నమోదు నేడు నిర్ణయం

సాక్షి, చెన్నై : ‘భార్య కోసం కేసుల్ని ఎదుర్కొంటున్న భర్త ’ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదా అని మద్రాసు హైకోర్టు ధర్మసందేహాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు తగ్గ పిటిషన్‌ బుధవారం కోర్టులో దాఖలు కావడంతో విచారణకు న్యాయమూర్తులు స్వీకరించారు. పిటిషనర్‌ తరఫు వాదనల్ని విన్నారు. నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు. 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసు హొసూరు ఎమ్మెల్యే,  మంత్రి బాలకృష్ణారెడ్డి మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో అనర్హత వేటుకు గురి కాక తప్పలేదు. మంత్రి, ఎమ్మెల్యే పదవులు దూరం కావడంతో మాజీ అయ్యారు. అలాగే, జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినా, చివరకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. బాలకృష్ణారెడ్డి పిటిషన్‌ను పరిగణించిన సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గత నెల  ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ఈ కేసు తగ్గ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా, ఆ విచారణ ముగిసే వరకు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు ఊరట కల్పించడంతో బాలకృష్ణారెడ్డి మద్దతు దారుల్లో ఆనందం వెల్లి విరిసింది. దీంతో తాను ప్రాతినిథ్యం వహించిన హొసూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సతీమణి జ్యోతికి మద్దతుగా బాలకృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, తన భార్య జ్యోతిని ఆదరించాలని గెలిపించాలని వీధి వీధినా, ఇంటింటా బాలకృష్ణారెడ్డి చక్కర్లు కొడుతున్నారు.

పుహలేంది వ్యతిరేకత : అన్నాడీఎంకే అభ్యర్థిగా జ్యోతి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆ పార్టీలో చీలికతో పుట్టుకొచ్చిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కలగం అభ్యర్థిగా పుహలేంది ప్రధాన ప్రత్యర్థిగా రేసులో ఉన్నారు. బాలకృష్ణారెడ్డి ప్రచారానికి చెక్‌ పెట్టే విధంగా బుధవారం మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్‌ వేశారు. ప్రజా ప్రతినిధుల చట్టం మేరకు శిక్ష పడ్డ వ్యక్తి, ప్రస్తుతం తానే అభ్యర్థి అన్నట్టుగా ప్రచారంలో ఉన్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇందుకు తగ్గ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్య ప్రసాద్‌ నేతృత్వంలోని పిటిషన్‌ పరిశీలించింది. విచారణలో పిటిషనర్‌ పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలను వీక్షించారు. పిటిషనర్‌ తరపు వాదనను పరిగణించి, విచారణకు స్వీకరించారు. ఈ సమయంలో కేసుల్ని ఎదుర్కొంటున్న భర్త, ఎన్నికల్లో తన భార్య కోసం ప్రచారం చేయకూడదా..? అన్న ధర్మసందేశాన్ని న్యాయమూర్తులు తెరపైకి తెచ్చారు.  ప్రజాప్రతినిధుల చట్టంలో శిక్షపడ్డ వాళ్లు అనర్హులు అని, ఎన్నికల్లో మళ్లీ నిలబడేందుకు అవకాశం లేదని, అయితే, పిటిషనర్‌ వాదన మేరకు ప్రచారాలు కూడా చేయకూడదా అంటూ వ్యాఖ్యలు చేశారు. చివరకు పిటిషన్‌ విచారణకు స్వీకరిస్తూ, మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన నిర్ణయాన్ని గురువారం చెబుతామని వాయిదా వేశారు. ఆ రోజున బాలకృష్ణారెడ్డి, ఎన్నికల కమిషన్‌ వివరణను న్యాయమూర్తులు కోరేనా, లేదా, ప్రచారాలకు వెళ్లకూడదన్నట్టుగా స్టే విధించేనా అన్నది వేచి చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top