సాదా సీదా ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Profile  - Sakshi

సాక్షి, వెబ్ ప్రత్యేకం : ‘నేనేమి అద్భుతాలు సష్టించలేను. పార్టీ కార్యకర్తలే పార్టీని బూతు స్థాయి నుంచి అభివృద్ధి చేయాలి. పార్టీని బలోపేతం చేయడంలో నాకు మీ సహకారం కావాలి. ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు. అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తాం’ అని ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంతం ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే యూపీలోని బులంద్‌షహర్‌లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కఠిన పదాలను కూడా మదువుగా చెప్పే మృదుభాషిణి. చెప్పదల్చుకున్న మాటలను సూటిగాను, అర్థవంతంగాను చెప్పగలిగే మాటల నేర్పరి. హిందీలో రాహుల్‌ గాంధీకన్నా,  అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఆమె సొంతం. ఆమె బాలివుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తల్లి తేచి బచ్చన్‌ (తేజ్వంత్‌ కౌర్‌) వద్ద హిందీ కవిత్వాన్ని నేర్చుకున్నారు. 

ఇక ఆహార్యంలో ఆమె నిరాడంబరత చూస్తే గాంధీ వారసత్వం గుర్తుకు వస్తుంది. ఎక్కువగా తెల్లటి పొడువు చేతుల చొక్కా, నల్లటి పాయింట్‌ ధరించే ప్రియాంక గాంధీ ఎక్కువ వరకు చేనేత చీరలనే ధరిస్తారు. నుదిటన బొట్టు, మెడలో నగా నట్ర ధరించకుండా, మొఖాన పౌడరు తప్ప ఎలాంటి మేకప్‌ లేకుండా సంచరించే ప్రియాంకలో ఎప్పుడూ చురుకుదనం కనిపిస్తుంది. సన్నటి సొట్ట పడే ఆమె బుగ్గల మీద కనిపించే చిద్విలాసమే ఆమెకు ప్రధాన అలంకారం.
 
ఇందిర వారసత్వం
‘నేను ఎంతమాత్రం నరేంద్ర మోదీ కూతుర్ని కాను, నేను రాజీవ్‌ గాంధీ కూతుర్ని’ అని ఆమె ముక్కు సూటిగా మాట్లాడడం ’ప్రియాంక గాంధీ ఇంకేమాత్రం చిన్న పిల్ల కాదు. రాజకీయ స్ఫురద్రూపి’ అన్న ఆమె తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మాటలను గుర్తు చేస్తాయి. 2014, మే నెలలో దూరదర్శన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ, ప్రియాంక తన కూతురు లాంటిదని వ్యాఖ్యానించడం తెల్సిందే. పొట్టి జుట్టు, ముక్కు సూటిగా మాట్లాడంలోనే కాకుండా అనేక అంశాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీలాగానే ఆమె ఉంటారని, ఆమె వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తే ఎంతో రాణించగలరని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆమెకు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ‘రాజకీయాల్లో అందరు రాణించలేరు. ఇప్పుడు నేను గడుపుతున్న జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కొందరికి కొన్ని పడవు. అది అంతే. దయచేసి నన్ను క్రియాశీలక రాజకీయాల్లోకి లాగకండి’ ఎన్డీడీవీ తరఫున సీనియర్‌ జర్నలిస్ట్‌ బార్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. 

ప్రియాంక రాజకీయ నేపథ్యం

  • 2004లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీలో సోనియా గాంధీకి ఎన్నికల ప్రచార మేనేజర్‌గా, రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచార పర్యవేక్షకురాలిగా పనిచేశారు. 
  • 2007లో జరిగిన ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి, రాయబరేలి ప్రాంతంలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. 
  • 2009లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేశారు. 
  • 2012లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇదివరకటిలా అమేథి, రాయ్‌బరేలీలకు పరిమితం కాకుండా అమేథి నుంచి సుల్తాన్‌పూర్‌ వరకు పార్టీ తరఫున ప్రచారం చేశారు.
  • 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. జగదీష్‌పూర్‌లో ఆమె సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ప్రజల్లోకి చొచ్చుకు పోవడం చర్చనీయాంశం అయింది. 
  • 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమేథి ప్రాంతానికే పరిమితమై ప్రచారం చేశారు. 
  • 2019లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనవరి 23వ తేదీన నియమితులయ్యారు. యూపీ తూర్పు ప్రాంతం పార్టీ ఇంచార్జిగా బాధ్యతలను ఆమె ఫిబ్రవరి 4వ తేదీన స్వీకరించారు. ఆ సందర్భంగా రాహుల్‌తో కలిసి ఆమె నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు విశేషంగా తరలి వచ్చారు. 

జీవిత నేపథ్యం
47 ఏళ్ల ప్రియాంక గాంధీ 1972, జనవరి 12వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీ, రాజీవ్‌ గాంధీ దంపతులకు జన్మించారు. ఢిల్లీలోని జీసస్‌ అండ్‌ మేరీ కాన్వెంట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె జీసస్‌ అండ్‌ మేరీ కాలేజీలోనే సైకాలోజీలో డిగ్రీ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బౌద్ధంలో ఎంఏ (2010)లో పట్టభద్రులయ్యారు. ఢిల్లీ వ్యాపార వేత రాబర్ట్‌ వాద్రాను 1997, ఫిబ్రవరి 18వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. బౌద్ధంలో ఆమె ఎంఏ పూర్తిచేశాక ఆమె బౌద్ధం స్వీకరించారు. ఆమెకు రాయ్హాన్, కూతురు మిరయా ఉన్నారు.
-వి. నరేందర్‌ రెడ్డి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top