శ్రమకు తగిన వేతనమేదీ?

Private teachers and lecturers Protest at district collectorates - Sakshi

     జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్ల ధర్నా 

     పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలి 

     సెలవులు ఇవ్వాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి 

     విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది 

     ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్లే ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్నాం 

     ప్రైవేట్‌ సంస్థలు మమ్మల్ని కనీసం ఉద్యోగులుగా గుర్తించడంలేదు

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో శ్రమ దోపిడీ జరుగుతోందని, శ్రమకు తగ్గవేతనం ఇవ్వడంలేదని ప్రైవేట్‌ టీచర్లు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగ భర్తీలు లేనందువల్లే ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేయాల్సి వస్తోందని, అక్కడ తమకు కనీస హక్కులు కూడా ఉండటం లేదని వివరించారు. శనివారం ప్రైవేట్‌ టీచర్లు, అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద  ధర్నాలు నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడంవల్లే విద్యార్థులు ప్రైవేట్‌ రంగం వైపు మళ్లుతున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్నారు.

తమ సెలవులు తమకు ఇవ్వాలని, యాజమాన్యం సెలవు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఉద్యోగిగా గుర్తింపు ఉండడంలేదన్నారు. రోజుకు 10 గంటలకుపైగా పనిచేయించుకుంటున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నామని, తమ జీవితాలతో ఆడుకోవద్దని సంస్థలను అభ్యర్థించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ తర్వాత జీవనోపాధి కల్పించే పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఏటా జీతం పెంచాలని, అధిక పనిగంటల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు, అధ్యాపకులకు ఆదివారం, రెండో శనివారం సెలవులు ఇవ్వాలని, అధిక పని గంటలను నియంత్రించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలను కల్పించాలని, జీవో నంబరు 1ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించారు.  

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు.. 
విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, అద్యాపకుల యూనియన్‌ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్, జిల్లా అధ్యక్షుడు డక్కిలి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్‌ ఎదుట పీటీఎల్‌యు (ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. బోధనావృత్తిపై మమకారంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉద్యోగాలు లేకపోవడంతో వేరే వృత్తి చేపట్టలేక ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అసలు జాతీయ సెలవులు ఇవ్వరని, కొన్ని విద్యా సంస్థల్లో కనీసం ఆదివారం కూడా సెలవులు ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యా సంస్థల్లో మహిళా టీచర్లు గర్భవతులు కాకూడదంటూ అగ్రిమెంట్లు కూడా చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.  

కోతలు లేకుండా జీతాలు ఇవ్వాలి 
అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో పీటీఎల్‌యు జిల్లా అధ్యక్షుడు బి.కాసన్న మాట్లాడుతూ.. సెలవు దినాల్లో వేతన కోత లేకుండా 12 నెలలకూ జీతం ఇవ్వాలన్నారు. ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సిబ్బందికి అడ్మిషన్‌ టార్గెట్లు ఇవ్వడం, ప్రచారకర్తలుగా వినియోగించడం నిషేధించాలన్నారు. ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో పీటీఎల్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలు చదువుల పేరుతో విద్యార్థులను, ఉద్యోగాల పేరుతో ఉపాధ్యాయులను దోచుకుంటున్నారన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో నేతలు మాట్లాడుతూ.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ధర్నాలో పలువురు టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top