
నెలవారీగా 5.8 శాతం డౌన్
ఇన్‌డీడ్ నివేదికలో వెల్లడి
ముంబై: సాధారణ ఉద్యోగ నియామకాలు (హైరింగ్) జూలైలో నెలవారీగా చూస్తే 5.8 శాతం నీరసించినట్లు ఉపాధి కల్పనా ప్లాట్‌ఫామ్ ఇన్‌డీడ్ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారికు ముందు స్థాయితో పోలిస్తే 70 శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇన్‌డీడ్ నివేదిక ప్రకారం ఉపాధి కల్పన కొనసాగే వీలుంది. హైరింగ్ మందగించినప్పటికీ ఉపాధి కల్పనలో అత్యుత్తమ ప్రావీణ్యత ప్రధాన పాత్ర పోషించింది.
వరుసగా రెండు నెలలు ఉద్యోగ కల్పన ఊపందుకున్న తదుపరి జూలైలో 5.8 శాతం క్షీణించింది. అయితే వార్షికంగా 2024 జూలైతో చూస్తే జాబ్ పోస్టింగ్స్ దాదాపు 15 శాతం వెనకడుగు వేశాయి. ఉపాధి కల్పనలో ఆరోగ్యపరిరక్షణ, లాజిస్టిక్స్ వృద్ధిలో ఉన్న వర్ధమాన రంగాలైనప్పటికీ.. టెక్నాలజీ యాంకర్ పాత్ర పోషిస్తోంది.
గత మూడు నెలలుగా డేటా, అనలిటిక్స్ 15.4 శాతం అధికంగా ఉద్యోగాలకు తెరతీయగా.. లాజిస్టిక్స్ 14.3 శాతం, థెరపీ 13.7 శాతం, డెంటల్ 13.6 శాతం చొప్పున ఉపాధి కల్పనలో వృద్ధి చూపాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వేగంగా పుంజుకోకపోయినా.. గత మూడు నెలలుగా 9.2 శాతం స్థాయిలో ఉద్యోగాలు కలి్పస్తోంది. అయితే మరోవైపు మెడికల్ ఇన్ఫర్మేషన్‌లో 12.3 శాతం, ఫార్మసీలో 10.7 శాతం, ఎడ్యుకేషన్‌లో 8 శాతం, ఫిజిషియన్స్‌లో 7.8 శాతం చొప్పున ఉద్యోగ కల్పనలో క్షీణత నమోదైంది.