ఆంధ్రజ్యోతికి ప్రెస్‌ కౌన్సిల్‌ షోకాజ్‌ నోటీసు 

Press Council Of India Issues Notices To Andhra Jyothi News Paper - Sakshi

బోగస్‌ సర్వే వార్త ప్రచురించినందుకుగాను.. 

గడువులోగా స్పందించకపోతే తగిన చర్యలు తీసుకుంటాం 

పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందంటూ బోగస్‌ సర్వే ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకు భారత ప్రెస్‌ కౌన్సిల్‌ (పీసీఐ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ ఫేక్‌ న్యూస్‌ ప్రచురణపై 15 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బుధవారం పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్‌ షోకాజ్‌ నోటీసును ఆంధ్రజ్యోతి సంపాదకులకు పంపించారు. ఈ వార్తకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ నోటీసును జారీ చేసినట్టు తెలిపారు. నోటీసు పంపిన తేదీ నుంచి నిర్ణీత గడువులోగా ఆ పత్రిక నుంచి స్పందన రాకపోతే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ అంశాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణ కమిటీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. 

ఇదీ నేపథ్యం... 
లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థలు నిర్వహించినట్టుగా పేర్కొన్న బోగస్‌ సర్వేలో టీడీపీ 126–135 ఎమ్మెల్యే స్థానాలు, 18–22 ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని ఈ నెల 2న ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. తాము ఏపీలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని, తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ హెచ్చరించింది. ఈ వార్తతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ బోగస్‌ సర్వే వార్తపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఇండియాకు సైతం పలువురు ఫిర్యాదు చేశారు. బోగస్‌ సర్వేలతో వార్తలు ప్రచురించడాన్ని తాను పెయిడ్‌ న్యూస్‌గా అనుమానిస్తున్నట్టు, ఈ వార్త ›ప్రచురణకు గాను ఆంధ్రజ్యోతి పత్రికపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌కు, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాలకు సీనియర్‌ జర్నలిస్టు, భారత ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు కె.అమర్‌నాథ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుతోపాటు ఆంధ్రజ్యోతి బోగస్‌ సర్వే వార్త, దాని ఇంగ్లిష్‌ అనువాదం, లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ ఖండన ఇతర వివరాలను కూడా జతచేశారు. ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా వార్తను ప్రచురించడం సరికాదని ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రికపై న్యాయపరంగా చర్య తీసుకోవాలని కోరారు. ఇలాంటి వార్తలు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగకుండా ప్రభావితం చేసే అవకాశమున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని అమర్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top