నెరవేరిన ప్రణబ్, ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

Pranab, RSS aim success - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించడం ద్వారా.. తాను అనుకున్న లక్ష్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సాధించింది. ఆది నుంచి వివాదాస్పదమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుకున్నట్లుగానే వీలైనంత ప్రచారం పొందింది. ఇక ప్రణబ్‌ ముఖర్జీ కూడా తెలివిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో బయటపెట్టడంలో విజయం సాధించారు. పైకి చెప్పకపోయినా.. ప్రణబ్‌ ప్రసంగం ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలకు అంతగా రుచించనట్లే కనిపించింది. ఏ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలివిగా మనసులో మాటను ప్రణబ్‌ వెల్లడించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం క్షుణ్నంగా తెలిసిన ప్రణబ్‌.. దానిని పరోక్షంగా విమర్శించేందుకు నెహ్రూ సోషలిజంను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. బౌద్ధం ఆవిర్భావం నుంచి ఎంత విధ్వంసం జరిగినా దేశం చెక్కుచెదరకుండా ఎలా కొనసాగిందో ప్రణబ్‌ చాటి చెప్పారు. సాంస్కృతిక ఐక్యమత్యంపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పిన అంశాల్ని ప్రస్తావించిన ప్రణబ్‌.. అదే సమయంలో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ను ప్రస్తావిస్తూ జాతీయవాదం, దేశభక్తికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే తన సొంత ధోరణిలో ప్రణబ్‌ ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పునరావాసంగా వాడుకునేందుకు ప్రణబ్‌ ఏమాత్రం ప్రయత్నించలేదన్న విషయం ఆయన ప్రసంగంతో స్పష్టమైంది. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ హుందాగావ్యవహరించారు.

కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌
గతంలో ఐదుగురు భారత రాష్ట్రపతులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు హాజరైనా.. ఈ స్థాయిలో ఎన్నడూ ప్రచారం లభించలేదు. ఈ కార్యక్రమ ప్రచార బాధ్యతలు మొత్తం కాంగ్రెస్‌ పార్టీనే తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి ప్రణబ్‌ హాజరుపై ఆ పార్టీ అతిగా స్పందించిందని విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో పాటు పలువురు సీనియర్‌ నేతలతో విమర్శలు చేయించింది.   

సొంత చరిత్రను గుర్తుచేయాల్సింది: లెఫ్ట్‌
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి  సీతారాం ఏచూరి స్పందిస్తూ..‘ఆరెస్సెస్‌ ప్రధానకార్యాలయంలో ప్రణబ్‌ ఇచ్చిన ప్రసంగంలో మహత్మాగాంధీ హత్య వివరాలు అదృశ్యమయ్యాయి. గాంధీ హత్య అనంతరం అప్పటి హోంమంత్రి పటేల్‌ అరెస్సెస్‌పై నిషేధం విధించడం, బాపూ హత్యతో అప్పటి ఆరెస్సెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకోవడం.. ఇలాంటి సొంత చరిత్రను ఆరెస్సెస్‌కు ఈ భేటీలో ప్రణబ్‌ మరింత గట్టిగా గుర్తుచేయాల్సింది’ అని ట్వీట్‌ చేశారు. కాగా తాము ఊహించినట్లే ప్రణబ్‌ మాట్లాడారనీ, ఏదేమైనా అయన ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సింది కాదని సీపీఐ వ్యాఖ్యానించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top