యేరే రాశ్టపోల్లు పచారానికత్తె జనం వోట్లెత్తరా?

Political Setirical Story on Lok Sabha Elections - Sakshi

బాతాఖానీ

యెప్పట్లెక్కనె మాపటీలి యాపశెట్టు నీడల కూసోంగ..  ‘భరోడ వోయిన సుమన్‌ పంతులు అచ్చిండట. మీకేవన్న కలిసిండా’ అనుకుంటచ్చిండు కట్టెమిషిని రంనయ్య‘వాడెప్పుడత్తడో, యెప్పుడు వోతడో యెవ్వలకు దెల్వదు. అయినా గాడత్తె నీకేం సంబురవో’ అన్నడు సుమన్‌ సంగత్తెల్సిన నాగ్రాజు‘ఏంలే గని.. పాల్రమెంట్‌ ఎలశ్చన్లున్నయ్‌ గద. మనం సపోట్‌ శేత్తన్న పార్టి క్యాండెట్‌ కోసం వూల్లె లీడర్లు తిర్గుతున్న సుత వోట్లు పడెటట్టు లేవాయె. సుమన్‌ అసొంటోల్ల తోటి పచారం జేపిత్తెనన్న లాబవుంటదని రంనయ్య యికమాతు. గంతెగదా సారూ..’ లాజిక్‌ల సాగర్రావు కండ్లెగిరేసుకుంట జెప్పిండు.
‘రోజు వూల్లె గన్పించె మన లీడర్లకు జనం సపోట్‌ జేత్తలేరు గని.. యెక్కన్నొ గుజ్రాత్‌ రాశ్టం భరోడలుండె సుమనన్న పచారం జేత్తె వోట్లు వడ్తయా? గయినె ఇంట్ల మాట్లాడె తెల్గే మర్శిపోయిండు ఆడికివొయ్యి..’ అన్కుంట రాజుగాడు మమ్ముల్ని జూసిండు.

‘అంటె పక్కరాశ్టపు శెంద్రాలుబాబుకు గది దెల్వదారా? తెల్గు రాని యేరే రాశ్టపు లీడర్లను పిల్పిచ్చి పచారం జేపిత్తలేడ.. గీడ వూల్లెకెల్లి బత్కనీకవోయిన వాల్లను పిల్పిచ్చి వోట్లెయ్యిమని చెప్పిత్తమంటె యేదేదో మాట్లాడవడ్తిరి..’ కోపంగ అన్నడు రంనయ్య‘అవ్‌ నేన్గుడ జూసినన్న టీవ్ల. మవత బెనర్జి, కేజిరివాలు, కాష్మీర్‌ లీడరు అసొంటి జనాలకు తెల్వని, తెల్గు రాని లీడర్లను దెచ్చి ఓపెంటాప్‌ జీబులల్ల తిరిగిన్రు. వాల్లు నేశ్నల్‌ లీడర్లా.. వాల్ల రాశ్టంల్నే వాల్లో పార్టికి లీడర్లు. అయిన దాన్కి దీన్కి లింకేంది?’ సాగర్రావు నడ్మజొచ్చిండు.

‘గాడ ఆంద్రల యేరే కతుందిరా నల్లమొకపోడ.. శెంద్రంబాబుకు ఆడ వోడిపోతనని దెల్సు. సర్వెలల్ల జగను గెలుత్తండని, తెల్దేశానికి శానా శీట్లల్ల డిపాజిట్లు సుత రావని అర్తమైంది. చివరాకిరికి ఆయిన దగ్గర పన్జేసే యింటల్జెన్స్‌ పోలీసోల్లు గుడ గదె జెప్పవట్టిరి. అద్కారం పోతదని దెల్శినప్పటి కెల్లి కిర్సనాయిల్‌ వొడిసిన గుడ్డిదీపం లెక్క ఐందాయినె కత.. గందుకె గసొంటి యేశాలేత్తండు..’ అన్నడు మెట్టుగుట్టల రమ్నరావు.

గప్పుడే శెట్టుకిందికచ్చిన కర్నాల సత్తన్న.. ‘వో గయిన సంగతా..  యెన్టియార్‌కు ఎన్కపోటప్పటి నుంచి శెంద్రంబాబును జనాలు సూత్తనే వుండిరి. గా మన్షేమొ ముసలోడైపాయె. గింకెన్నేండ్లు నల్లికుట్ల రాజకీయాల్జేస్తె జనాలింటరు? పబ్లిక్‌ మీటింగ్లల్ల శెప్పిందె శెప్పవట్టె. యాక్టర్‌ దోస్త్‌ పవన కల్యానం, యెన్నారై దోస్త్‌ కేయె పాలు, ఇంకో యాక్టరు బామ్మర్ది బాలయ్య, కొడ్కు మందల్గిరి లోకేషం అసొంటోల్లను తిప్పుతన్న గుడ లాబం ఐతలేదాయె. గందుకె కలకత్త, డిల్లి, కాష్మీరు లీడర్లను దెచ్చుకున్నడేమొ. గీల్లను జూసన్న వోట్లు వడకపోతయా అని?’ కుండపలుగ్గొట్టినట్టె శెప్పిండు.

‘శెంద్రంబాబు లెక్క మనం సుత∙భరోడ సుమన్, అమ్రికాలున్న అమర్, దుబాయి తిర్పతి, ఐద్రాబాదు కిరన్, సెంట్నరి కాల్ని కిషన్, కర్నారం రామ్మోన్రావు... గిసొంటోల్లందర్ని పిలిపిచ్చి పచారం చేపిత్తమంటవా ఏంది?’ పాయింట్‌ దీసిండు లచ్చన్న.

‘గవ్వన్నేడైతయ్‌ లచ్చన్నా. గాడ శెంద్రంబాబనే పెద్ద లీడర్‌ సక్కగ లేడు. గాయిన జేసే లత్కోర్‌ పాల్టిక్స్‌తోటి జనాలకు ఇసుగచ్చింది. గీ దరిద్రం యెప్పుడు వోతదా అని సూత్తన్రు. మవత బెనర్జచ్చినా, కేజిరి వాలచ్చిన అయ్యేదేం లేదు. లల్లుపర్సాద్‌ లెక్క జేలుకెల్లుడె మిలిగింది. గీడ గట్ల గాదు. మనూల్లె ఒక్కలిద్దరు లీడర్లే సక్కగ లేరు. గాదాన్కి బైటికెల్లి మనోల్లను పిల్సుడెందుకు. మనమె వూల్లె పచారం జేసి మన క్యాండెట్‌కు వోట్లేపిత్తాం. నువ్వునేను జెప్తె వూల్లె జనం ఇనరా?’ అన్కుంట నేన్లేసిన.-పోలంపల్లిఆంజనేయులు,సాక్షి ప్రతినిధి– కరీంనగర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top