ఎన్నికలు సమీపిస్తుంటే గుర్తొచ్చామా? | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సమీపిస్తుంటే గుర్తొచ్చామా?

Published Fri, Sep 21 2018 6:51 AM

People Against To Vasupalli Ganesh Kumar In Visakhapatnam - Sakshi

పాతపోస్టాఫీసు(వివిశాఖ దక్షిణ): ‘నాలుగున్నర సంవత్సరాలుగా మా ప్రాంతాన్ని సందర్శించని మీకు ఇప్పుడు గుర్తొచ్చామా? ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఓట్లు దండుకోవడానికి వచ్చారా. మా ప్రాంతంలో సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు’ అంటూ జీవీఎంసీ 21వార్డు కోడిపందాలవీధి, మీదిరెల్లివీధి ప్రజలు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను నిలదీశారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో వార్డు పర్యటనలో భాగంగా మీదిరెల్లివీధి, కోడిపందాలవీధికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు చుట్టుముట్టారు. హుద్‌హుద్‌ తుపానులో పూరిళ్లు కూలిపోయి, పైకప్పులు ఎగిరిపోయిన వారిలో చాలామందికి  నేటికీ పరిహారం అందకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.

స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పని ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న సమస్యలను చెప్పమనడంతో వారంతా నిరసన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక యువకులతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు.  మంచినీరు, పారిశుద్ధ్యం, శిథిలమైన మెట్లమార్గం, దరఖాస్తు చేసుకున్నా రాని పింఛన్లు, తెల్ల రేషన్‌ కార్డులు ఇలా ఒకటనేమిటి అనేక సమస్యలను ఎమ్మెల్యే ముందుంచారు. వాటిని పరిష్కరించనప్పుడే వీధిలో అడుగుపెట్టాలంటూ వాదనకు దిగారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించినా స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే వాసుపల్లి వెనుతిరగాల్సి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement