
సాక్షి, న్యూఢిల్లీ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో పవన్‌తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు. అనంతరం అలాగే కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి మురళీధరన్, కో-ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ కూడా పవన్ కలిశారు. ఆ తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ బయల్దేరారు.
కాగా బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చినా... బీజేపీ పెద్దలు ఎవరితోనూ అపాయింట్‌మెంటు లభించకపోవడంతో చివరకు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ను మాత్రమే ఆయన కలుసుకోగలిగారు. అయితే నిన్న పవన్...ఆర్‌ఎస్‌ఎస్ నేతలును కలిశారు. కాగా గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే.