బోటు ప్రమాద ఘటనలో మంత్రే అసలు దోషి

Parthasarathy fires on Minister Devineni - Sakshi - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటనకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసలు కారకుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయనకు నెలనెలా ముడుపులు అందుతున్నాయి కాబట్టే అనధికారిక పడవలు నడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, కూత వేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం ఉందని, అక్కడే ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నా బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బోటు ఓనర్‌ను పట్టుకున్నామని, టూరిజమ్‌ జీఎంను సస్పెండ్‌ చేశామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఘటనకు కేవలం బోటు డ్రైవరే కారణమని చెప్పడం సరికాదని, ఇరిగేషన్‌ శాఖ మంత్రినే అసలు బాధ్యుడిని చేయాలని డిమాండ్‌ చేశారు. నెల నెలా ముడుపులు ముడుతున్నాయి కాబట్టి అనధికార బోట్లు తిరుగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారని ఆరోపించారు.  బోటు ఘటనపై జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్థసార«థి డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top