కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగేశ్ కుమార్ సింగ్
భువనేశ్వర్: ఒడిశా హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2014 ఎన్నికల్లో తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగేశ్ కుమార్ సింగ్‌పై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెలువరించింది.
ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 2014 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సుందర్‌గఢ్ నియోజకవర్గం నుంచి జోగేశ్ గెలుపొందారు.  ఇది ఎస్టీలకు రిజర్వు చేయబడిన నియోజకవర్గం. అయితే, జోగేశ్ గెలుపును సవాల్ చేస్తూ బీజేడీ అభ్యర్థి కుసుమ్ టెటే, బీజేపీ అభ్యర్థి సహదేవ్ జాజా ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగేశ్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం బూటకమైనదని, కావాలనే ఆయన ఎస్టీగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారని, కాబట్టి ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని హైకోర్టును అభ్యర్థించారు.  
హైకోర్టు తీర్పుపై జోగేశ్ స్పందిస్తూ.. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకముందని, త్వరలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన మీడియా తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
